India: తొక్కిపెట్టబడిన నివేదిక బయటకు... దేశంలో నిరుద్యోగ రేటు 45 ఏళ్ల గరిష్ఠానికి!

  • గత సంవత్సరమే కేంద్రానికి నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ నివేదిక
  • బయట పెట్టడం లేదంటూ రాజీనామా చేసిన ఇద్దరు సభ్యులు
  • ఆ మరుసటి రోజే సంచలన విషయాలు చెబుతూ బయటకు వచ్చిన రిపోర్టు

ఇండియాలో నిరుద్యోగుల సంఖ్య గడచిన 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ తయారు చేసిన ఓ రిపోర్టును గడచిన సంవత్సరమే ప్రభుత్వానికి అందించగా, దీన్ని ఇంతవరకూ బయటకు రాకుండా తొక్కిపెట్టారు. ఇప్పుడీ నివేదిక ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు అందింది.

నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ నుంచి ఇద్దరు స్వతంత్ర సభ్యులు మంగళవారం నాడు తమ పదవులకు రాజీనామా చేసి వెళ్లగా, ఆ మరుసటి రోజే ఈ రిపోర్టు బయటకు రావడం గమనార్హం. రాజీనామా చేసిన వారిలో సంస్థ యాక్టింగ్ చైర్మన్ పీసీ మోహనన్ కూడా ఉన్నారు. ఈ సర్వేను బయట పెట్టడంలో తీవ్ర జాప్యం జరుగుతున్న కారణంగానే తాను ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు తెలిపారు. ఆయనతో పాటు కమిటీలోని ఏకైక ప్రభుత్వేతర సభ్యురాలు జేవీ మీనాక్షీ దేవి కూడా తన పదవికి రిజైన్ చేశారు.

ఇందులోని వివరాల ప్రకారం పీఎల్ ఎఫ్ సర్వే (పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే)లో నిరుద్యోగ రేటు 6.1 శాతానికి పెరిగింది. 1972 - 73 తరువాత నిరుద్యోగ రేటు ఇంత అధికంగా ఉండటం ఇదే తొలిసారి. 2011-12లో 2.2 శాతానికి నిరుద్యోగ రేటు పడిపోయింది. ఇక పట్టణ ప్రాంతాల్లో 7.8 శాతం మంది నిరుద్యోగులు ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 5.3 శాతం మంది నిరుద్యోగులున్నారని ఈ రిపోర్టు చెబుతోంది. ఎంతో మంది కార్మికులు నైపుణ్య కొరత కారణంగా ఉద్యోగాలకు దూరమవుతున్నారు.

 మధ్యంతర బడ్జెట్ రేపు పార్లమెంట్ ముందుకు రానుండటం, త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఉద్యోగ గణాంకాలపై విపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి.

More Telugu News