Gandhi: గాంధీ చిత్రపటంపై తుపాకితో కాల్చిన 'హిందూ మహాసభ'... 'గాడ్సే అమర్‌ రహే' అని నినాదాలు!

  • గురువారం నాడు జాతిపిత గాంధీజీ 71వ వర్ధంతి
  • శౌర్య దివస్ ను జరుపుకున్న హిందూ మహాసభ
  • ప్రతి సంవత్సరమూ గాంధీ దహనం ఉంటుందన్న పూజా శకున్ పాండే

గురువారం నాడు జాతిపిత గాంధీజీ 71వ వర్ధంతి సందర్భంగా దేశప్రజలంతా ఆయనకు నివాళులర్పిస్తున్న వేళ, గాడ్సే మాతృసంస్థ 'హిందూ మహాసభ' ఆయన్ను తీవ్రంగా అవమానించింది. యూపీలోని అలీగఢ్‌ లో ఆ సంస్థ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సభ్యులందరూ చప్పట్లు కొడుతూ, హర్షధ్వానాలు చేస్తుండగా, జాతీయ కార్యదర్శి పూజా శకున్‌ పాండే, గాంధీ చిత్రపటాన్ని గన్ తీసుకుని కాల్చారు. ఆపై అక్కడున్న వారు 'మహాత్మా నాథూరాం గాడ్సే అమర్‌ రహే' అని నినాదాలు చేశారు. ఆపై గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు.

అనంతరం పూజా శకున్ పాండే మీడియాతో మాట్లాడుతూ, గాంధీ హత్యా ఘటనను తాము పునఃసృష్టించామని, దీని ద్వారా సరికొత్త సంప్రదాయానికి నాందిపలికామని వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రతి సంవత్సరమూ దసరా నాడు రావణాసురుడి బొమ్మను దహనం చేసినట్టుగానే, ఇకపై గాంధీ దహనమూ కొనసాగుతుందని అన్నారు. కాగా, హిందూ మహాసభలో గాడ్సే సభ్యుడన్న సంగతి తెలిసిందే. ఆయన గాంధీని హత్య చేసిన రోజును హిందూ మహాసభ 'శౌర్యదివ్‌స' పేరిట జరుపుకుంటోంది.

More Telugu News