Telangana: నా అంచనా ఎన్నడూ తప్పలేదు.. తెలంగాణలో మొదటిసారి తారుమారు అయింది!: లగడపాటి

  • ఇబ్రహీంపట్నంలో స్వతంత్ర అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయి
  • పంచాయతీ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు చాలా తేడా ఉంది
  • విపక్షాలు పంచాయతీల్లో గణనీయంగా పుంజుకున్నాయి

గతంలో తన ఆర్జీ ఫ్లాష్ టీమ్ అంచనాలు ఎన్నడూ తప్పలేదని విజయవాడ పార్లమెంటు మాజీ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సైతం తన అంచనాకు 2-3 సీట్ల తేడా మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా తన సర్వే అంచనాలు తారుమారు అయ్యాయని పేర్కొన్నారు. ఈ విషయమై తాను నెలరోజుల పాటు అధ్యయనం చేశాననీ, తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశానని అన్నారు. ఢిల్లీలో ఈరోజు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో లగడపాటి మాట్లాడారు.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో సమస్య ఉందని కొందరు, పోలింగ్ శాతం చెప్పడానికి ఒకటిన్నర రోజు పట్టిందని మరికొందరు నేతలు అనుమానాలు వ్యక్తం చేశారని లగడపాటి తెలిపారు. తెలంగాణలో ఎన్నడూ లేనివిధంగా ధన ప్రవాహం ఉంటుందని తాను ముందుగానే చెప్పానన్నారు. తెలంగాణలో నిశ్శబ్ద ఓటు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా, కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటుందని తాను భావించానన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఈవీఎంలను లెక్కిస్తే ఈవీఎం కంటే వీవీప్యాట్ లో ఇండిపెండెంట్ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. ఈ కేసు ప్రస్తుతం హైకోర్టులో విచారణలో ఉందన్నారు.

తెలంగాణ పంచాయితీ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలకు మధ్య చాలా తేడా ఉందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్షాల బలం గణనీయంగా పెరిగిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం నేపథ్యంలో విపక్షాలు తుడిచిపెట్టుకుపోవాలని, కానీ తెలంగాణలో మాత్రం ప్రతిపక్షాలు దీటుగా నిలిచాయని అన్నారు.  

More Telugu News