Andhra Pradesh: ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ మోదీకి చంద్రబాబు లేఖలు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా!: బొత్స సవాల్

  • ప్రత్యేకహోదాకు వైసీపీ కట్టుబడి ఉంది
  • ఫిబ్రవరి 1 బంద్ కు మద్దతు ఇవ్వబోం
  • మీడియాతో మాట్లాడిన వైసీపీ నేత

ప్రత్యేకహోదా తీసుకొచ్చేందుకు వైసీపీ కట్టుబడి ఉందని ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. వైసీపీ ప్రత్యేకహోదా కోసం బంద్ నిర్వహించినప్పుడు ఈ నేతలే తమపై విమర్శలు చేశారని గుర్తుచేశారు. తమ నేతలు చాలామందిని అరెస్ట్ చేసి జైలులో పెట్టారని పేర్కొన్నారు. వారే ఇప్పుడు ప్రత్యేకహోదా పేరుతో బంద్ కు పిలుపునిచ్చారని వ్యాఖ్యానించారు. విజయవాడలో ఈరోజు ఓ మీడియా ఛానల్ తో బొత్స మాట్లాడారు.

ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీలపై ఢిల్లీలో వైసీపీ ఆందోళన చేస్తే.. ‘ఢిల్లీలో ధర్నా చేస్తే ఏం ప్రయోజనం?’ అని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారని బొత్స అన్నారు. తాము హోదా విషయమై గుంటూరులో ధర్నా చేస్తే..‘ఇక్కడ చేసి ఏం ప్రయోజనం. ఢిల్లీకి వెళ్లండి’ అని చెప్పారని వ్యాఖ్యానించారు. ఏపీ అభివృద్ధి కోసం 29 సార్లు తాను ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలిశానని చంద్రబాబు చెప్పడాన్ని బొత్స తీవ్రంగా తప్పుపట్టారు.

‘ఈ 29 సార్లలో ఓ మూడింటిని వదిలేద్దాం.. మిగిలిన 26 సార్లు మోదీని కలుసుకున్నప్పుడు చంద్రబాబు ప్రత్యేకహోదాపై లేఖలు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా’ అని సవాల్ విసిరారు. ఫిబ్రవరి 1న జరిగే బంద్ కు తాము మద్దతు ఇవ్వబోవడం లేదని తేల్చిచెప్పారు.

More Telugu News