Aircel-Maxis case: చట్టంతో ఆడుకోవద్దు... తీవ్రమైన చర్యలుంటాయి!: కార్తీ చిదంబరంకు సుప్రీంకోర్టు వార్నింగ్

  • విదేశాలకు వెళ్లేందుకు కార్తీని అనుమతించిన సుప్రీంకోర్టు
  • రూ. 10 కోట్లు డిపాజిట్ చేయాలంటూ ఆదేశం
  • విచారణ సంస్థలకు సహకరించకపోతే.. తీవ్ర చర్యలంటూ హెచ్చరిక 

ఎయిర్ సెల్-మ్యాక్సిస్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంకు విదేశాలకు వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ సందర్భంగా కార్తీ చిదంబరంకు సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. 'మీరు ఎక్కడకు వెళ్లాలనుకుంటే అక్కడకు వెళ్లండి. ఏమి చేయాలనుకుంటే అది చేయండి. కానీ చట్టంతో ఆటలాడవద్దు. విచారణ సంస్థలకు సహకరించండి. సహకరించకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారు. భారీ ఎత్తున మీపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది' అంటూ వార్నింగ్ ఇచ్చింది.

మార్చి 5, 6, 7, 10 తేదీల్లో ఈడీ ముందు హాజరుకావాలని ఈ సందర్భంగా కార్తీని సుప్రీంకోర్టు ఆదేశించింది. విదేశాలకు వెళ్లేందుకు తమ వద్ద రూ. 10 కోట్లు డిపాజిట్ చేయాలని తెలిపింది. టెన్నిస్ టోర్నమెంట్లకు గాను ఫిబ్రవరి, మార్చి నెలల్లో యూకే, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్ లకు వెళ్లేందుకు అనుమతించాల్సిందిగా సుప్రీంను కార్తీ కోరారు.

ఈ నేపథ్యంలో, గత వారం ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు... కేసు విచారణకు సంబంధించి కార్తీ ఎప్పుడు హాజరుకావాలో తేదీలను తమకు అందజేయాలని ఈడీని సుప్రీం సూచించింది. అయితే, విచారణకు కార్తీ సహకరించడం లేదని... దీంతో, అతన్ని విదేశాలకు వెళ్లేందుకు అనుమతించవద్దని సుప్రీంను ఈడీ కోరింది. కార్తీ విదేశీ పర్యటనల వల్ల తమ విచారణ నెమ్మదిస్తోందని తెలిపింది. ఈ నేపథ్యంలో, కార్తీకి కండిషన్లతో కూడిన అనుమతిని సుప్రీంకోర్టు ఇచ్చింది. 

More Telugu News