Andhra Pradesh: ఏపీకి అత్యంత అన్యాయం చేసిన కేంద్రం: ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్

  • ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఎన్నో హామీలు
  • అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలం
  • ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఎన్నో హామీలను ఇచ్చిన అప్పటి ప్రభుత్వం, ఆపై అధికారంలో ఉన్న ప్రభుత్వం వాటిని నెరవేర్చడంలో తీవ్రంగా వైఫల్యం చెందాయని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్ 14వ శాసన సభ చివరి సమావేశాలు ప్రారంభంకాగా, ఉభయ సభలను ఉద్దేశించి నరసింహన్ ప్రసంగించారు. తన ప్రభుత్వం కేంద్రం సహకరించకున్నా, ఎన్నో సంక్షేమ పథకాలను, ప్రజాపయోగ కార్యక్రమాలను చేపట్టిందని ఆయన అన్నారు. రాష్ట్రానికి అత్యంత అన్యాయం జరిగినా అభివృద్ధి పథంలో పయనిస్తున్నామని, గడచిన నాలుగున్నరేళ్ల వ్యవధిలో వివిధ రంగాల్లో జరిగిన అభివృద్ధిపై 10 శ్వేతపత్రాలను ఇటీవలే విడుదల చేశామని గుర్తు చేశారు.

ఎన్టీఆర్ భరోసా పింఛన్ మొత్తాన్ని రూ. 1000 నుంచి రూ. 2 వేలకు పెంచామని, త్రీ వీలర్ వాహనాలకు పన్ను మినహాయింపులు ఇచ్చామని నరసింహన్ తెలిపారు. వ్యవసాయ రంగంలో వాడుతున్న యంత్ర పరికరాలకు కూడా ఇవే మినహాయింపులను అమలు చేస్తున్నామని అన్నారు. కేంద్రం అగ్రవర్ణ పేదలకు ప్రకటించిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్లను ఒక్క కాపులకే ఇవ్వాలని కూడా తన ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. స్వయం సహాయక బృంద సభ్యులకు రూ. 10 వేలు కూడా మంజూరు చేశామన్నారు.

రాష్ట్ర విభజన అసంబద్ధంగా జరిగిందని, కడపకు మంజూరు చేస్తామన్న ఉక్కు కర్మాగారాన్ని, కేంద్ర సహకారం లేకుండానే తన ప్రభుత్వం చేపట్టిందని, దీని వల్ల వేలాది మందికి ఉపాధి అవకాశాలు దగ్గర కానున్నాయని గవర్నర్ వ్యాఖ్యానించారు. నవ్యాంధ్ర నూతన రాజధాని నగరం అమరావతి నిర్మాణం శరవేగంగా సాగుతోందని, కేంద్రం సకాలంలో నిధులను అందించకున్నా, ప్రభుత్వం నిర్మాణాలను పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతోందని తెలిపారు. జాతీయ సగటుతో పోలిస్తే, రాష్ట్ర వృద్ధి అధికంగా ఉందని చెప్పారు.

More Telugu News