india: న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం... సిరీస్ కైవసం

  • 244 పరుగులకు ఆలౌట్ అయిన కివీస్
  • మరో 7 ఓవర్లు ఉండగానే టార్గెట్ ను ఛేదించిన టీమిండియా
  • 3-0తో సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్

న్యూజిలాండ్ తో మౌంట్ మాంగనుయ్ లో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. తద్వారా 5 వన్డేల సిరీస్ ను 3-0తో కైవసం చేసుకుంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 244 పరుగుల విజయలక్ష్యాన్ని మరో 7 ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించింది. కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రాహుల్ శర్మలు మరోసారి అద్భుత ఆటతీరును కనబరిచి భారత్ విజయానికి బాటలు పరిచారు.

అంతకు ముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ను ఎంచుకుంది. అయితే, టాస్ గెలిచిన ఆనందం వారికి ఎంతో సేపు నిలవలేదు. 10 పరుగుల వద్ద తొలి వికెట్, 26 పరుగుల వద్ద రెండో వికెట్, 59 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయి ఇక్కట్లలో పడింది. ఆ తర్వాత రాస్ టేలర్, లాథమ్ లు కలసి ఇన్నింగ్స్ ను నిర్మించారు. వీరిద్దరూ కలసి 119 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ పరిస్థితుల్లో లాథమ్ ను చాహల్ పెవిలియన్ చేర్చాడు. అనంతరం కివీస్ కోలుకోలేక పోయింది. 49 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌట్ అయింది.

కివీస్ బ్యాట్స్ మెన్లలో గుప్టిల్ 13, మన్రో 7, విలియంసన్ 28, టేలర్ 93, లాథమ్ 51, నికోల్స్ 6, శాంట్నర్ 3, బ్రేస్ వెల్ 15, సోథి 12, బౌల్ట్ 2 పరుగులు చేశారు. 2 పరుగులతో ఫెర్గ్యూసన్ నాటౌట్ గా నిలిచాడు. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు తీయగా... భువనేశ్వర్ కుమార్, చాహల్, పాండ్యాలు చెరో 2 వికెట్లు తీశారు. బ్రేస్ వెల్ రనౌట్ గా వెనుదిరిగాడు.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్... టార్గెట్ ను అలవోకగా ఛేదించింది. డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ 62 పరుగులు, కోహ్లీ 60 పరుగులు చేసి భారత్ విజయాన్ని సునాయాసం చేశారు. ధావన్ మాత్రం 28 పరుగులు మాత్రమే చేసి, నిరాశపరిచాడు. చివర్లో అంబటి రాయుడు 40, దినేష్ కార్తీక్ 38 దూకుడుగా ఆడి భారత్ ను విజయతీరాలకు చేర్చారు. మరో 7 ఓవర్లు, 7 వికెట్లు చేతిలో ఉండగానే భారత్ విజయపతాకం ఎగురవేసింది.

కివీస్ బౌలర్లలో బౌల్ట్ 2, శాంట్నర్ ఒక వికెట్ తీశారు. 9 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసిన మొహమ్మద్ షమీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

More Telugu News