Venkaiah Naidu: కష్టపడే వారు ఎప్పుడూ నష్టపోరు... అందుకు నేనే ఉదాహరణ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

  • ఢిల్లీలోని ఆంధ్రా అసోసియేషన్‌ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ప్రసంగం
  • సంస్కృతీ సంప్రదాయాలు, భాషను కాపాడుకోవాలి
  • అసోసియేషన్‌ సేవలు అభినందనీయం

జీవితంలో కష్టపడే వారు ఎప్పుడూ నష్టపోరని, తానీ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దాని వెనుక తాను పడిన కష్టం ఎంతో ఉందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఢిల్లీలోని ఆంధ్రా అసోసియేషన్‌ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. సంస్కృతీ సంప్రదాయాలను, భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదీ అని, ఈ విషయంలో ఢిల్లీలోని ఆంధ్రా అసోసియేషన్‌ 84 ఏళ్లుగా అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు.

తెలుగువారికి సేవలు చేసేందుకు అసోసియేషన్‌ను ప్రారంభించిన మాజీ రాష్ట్రపతి వి.వి.గిరి, ఎన్‌.జి.రంగాల ముందుచూపు చిరస్మరణీయమన్నారు. మాతృభాషతోనే నిజమైన ప్రగతి సాధ్యమవుతుందన్న మహాత్మాగాంధీ మాటలను ఈ సందర్భంగా వెంకయ్య గుర్తు చేశారు. వ్యక్తిత్వమే నిజమైన కొలమానమని, పదవులను చూసి మనిషిని అభిమానించే విధానం మంచిది కాదన్నారు.

‘ఓసారి ఎన్టీఆర్‌ వద్దకు వెళ్లినప్పుడు ఆయనకు కొందరు మహిళలు పాదాభివందనం చేయడం కనిపించింది. ఇది సరికాదేమోనని అప్పట్లో అంటే ‘అది వారి అభిమానం’ అంటూ ఎన్టీఆర్‌ కొట్టిపారేశారు. కానీ ఆరు నెలల తర్వాత ఆ మహిళలే ఆయనకు వెన్నుపోటు పొడిచారు’ అని తెలిపారు. తొలుత అసోసియేషన్‌ భవనంలో నూతనంగా నిర్మించిన ‘గోదావరి’ ఆడిటోరియంను వెంకయ్యనాయుడు ప్రారంభించారు.

More Telugu News