Nalgonda District: ఆర్టీసీ బస్సులో చిరిగిన మహిళ పట్టుచీర.. రూ. 3 వేల జరిమానా విధించిన ఫోరం

  • గతేడాది ఆగస్టులో ఘటన
  • నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిన డ్రైవర్
  • వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించిన బాధితులు

హైదరాబాద్‌లో బంధువుల ఇంట జరుగుతున్న  పెళ్లికి హాజరయ్యేందుకు నల్గొండకు చెందిన భార్యాభర్తలు కట్టెకోల నరసింహారావు, వాణిశ్రీ ఆర్టీసీ బస్సెక్కారు. ఈ క్రమంలో మహిళ కట్టుకున్న పట్టుచీర బస్సు ప్రవేశ ద్వారం వద్ద బయటకు తేలిన రేకుకు తాకి చిరిగిపోయింది. దీంతో ఉసూరుమన్న వాణిశ్రీ ఆ రేకును సరిచేయాల్సిందిగా బస్సు డ్రైవర్‌ను కోరింది. అయితే, అది తమ పనికాదని, అది డిపో వ్యవహారమని డ్రైవర్ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు.

దీంతో దంపతులు డిపో మేనేజర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన కూడా పట్టించుకోకపోవడంతో వారు ప్రయాణించిన బస్సు టికెట్, బయటకు తేలిన ఇనుప రేకు, బస్సు ఫొటోలతో నల్గొండలోని వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. గతేడాది ఆగస్టు 26న ఈ ఘటన జరిగింది. విచారణ చేపట్టిన ఫోరం ఆర్టీసీ బస్సులో లోపాలు నిజమేనని నిర్ధారించింది. పట్టు చీరకు రూ. 2 వేలు, ఇతర ఖర్చులకింద మరో వెయ్యి రూపాయిలు జరిమానాను చెల్లించాల్సిందిగా ఆర్టీసీని ఆదేశించింది.

More Telugu News