Andhra Pradesh: దగ్గుబాటి హితేశ్ కు అమెరికా పౌరసత్వం.. ఎన్నికల్లో పోటీ చేయడానికి అడ్డంకి?

  • పౌరసత్వం రద్దుకు దరఖాస్తు చేసిన హితేశ్
  • గడువులోగా ఆమోదం పొందితే ఎన్నికల్లో పోటీ
  • లేకుంటే రంగంలోకి దగ్గుబాటి వెంకటేశ్వరరావు

వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు, తన కుమారుడు హితేశ్ చెంచురామ్ తో కలిసి ఆ పార్టీ అధినేత జగన్ ను కలుసుకున్న సంగతి తెలిసిందే. మంచి రోజు చూసుకుని త్వరలోనే పార్టీలో చేరుతామని దగ్గుబాటి ఈ సందర్భంగా ప్రకటించారు. రాబోయే ఏపీ ఎన్నికల్లో దగ్గుబాటి హితేశ్ ను ప్రకాశం జిల్లాలోని పర్చూరు నుంచి పోటీ చేయిస్తారని ప్రచారం సాగింది. అయితే జగన్ ఒకవేళ టికెట్ ఇచ్చినా పర్చూరు నుంచి హితేశ్ పోటీ చేయలేకపోవచ్చని తెలుస్తోంది.

దగ్గుబాటి హితేశ్ కు ప్రస్తుతం అమెరికా పౌరసత్వం ఉంది. విదేశీ పౌరసత్వం ఉన్నవారు భారత ఎన్నికల్లో పోటీ చేయడం నిబంధనల ప్రకారం కుదరదు. ఈ నేపథ్యంలో అమెరికా పౌరసత్వం రద్దుకు హితేశ్ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఈ పౌరసత్వం రద్దయిన వెంటనే హితేశ్ తన తండ్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి వైసీపీలో చేరుతారని తెలుస్తోంది. ఒకవేళ నిర్ణీత సమయంలోగా పౌరసత్వం రద్దుకాకుంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావే పోటీలోకి దిగే అవకాశముందని ఆయన సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. 

More Telugu News