Andhra Pradesh: పేరు వెనుక రెడ్డి అని పెట్టుకోవడానికి సిగ్గు పడొద్దు!: రెడ్డి కులస్తులకు పోచారం శ్రీనివాసరెడ్డి సూచన

  • రెడ్లు ఒకరికి ఇచ్చేవాళ్లే-పుచ్చుకునేవాళ్లు కాదు
  • హైదరాబాద్ లో పోచారంకు సన్మానం చేసిన రెడ్డి జనసంఘం
  • విద్యార్థులకు స్కాలర్ షిప్పులు అందించిన పోచారం

రెడ్డి హాస్టల్ విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. పోచారం స్పీకర్ గా ఎన్నికైన నేపథ్యంలో హైదరాబాద్ లో ఈ రోజు ‘రెడ్డి జన సంఘం’ నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పోచారం పాల్గొన్నారు. ఆనంతరం ప్రతిభ కనబరిచిన రెడ్డి సామాజికవర్గం విద్యార్థులకు స్కాలర్ షిప్పులు అందజేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. పేరు వెనుక రెడ్డి అని పెట్టుకోవడానికి సిగ్గుపడాల్సిన పనిలేదని తెలిపారు.

‘రెడ్లు ఒకరికి ఇచ్చేవారే తప్ప పుచ్చుకునేవారు కాదు. మన చెయ్యి ఎప్పుడూ పైనే ఉంటుంది తప్ప కింద ఉండదు. ఆ ప్రత్యేకత కలిగినటువంటి వర్గమే రెడ్డి సామాజికవర్గం. కొడుకు పేరు రెడ్డి అని పెడితే, మనవడి పేరు రెడ్డి అని పెడితే ఏమవుతుందో అని అనుకుంటున్నారు. ఏమీ కాదు. తలెత్తుకుని గర్వంగా బతకగలుగుతాం. సాధారణంగా మన జానాభా చూసుకుంటే రెడ్డి సామాజికవర్గం ఎక్కడో వెనుక ఉండాలి.

కానీ మన స్వభావం, ఇతరులకు సాయం చేయాలన్న మనస్తత్వం మనకు ఉంది కాబట్టే మన సామాజికవర్గం సంఖ్య తక్కువైనా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు ఇలా ప్రజాప్రధినిధులుగా రెడ్లే ఎక్కువ మంది కొనసాగుతున్నారు’ అని తెలిపారు. ఈ సందర్భంగా రెడ్డి విద్యార్థుల సంక్షేమం కోసం విరాళాలు అందించిన పలువురు దాతలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు, రెడ్డి నాయకులు పాల్గొన్నారు.

More Telugu News