Andhra Pradesh: కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి ఝులక్.. వైసీపీలో చేరనున్న తమ్ముడు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి!

  • టీడీపీలో చేరేందుకు కోట్ల ప్రయత్నాలు
  • కాంగ్రెస్ అధిష్ఠానం ఏకపక్ష ధోరణిపై ఆగ్రహం
  • కాంగ్రెస్-టీడీపీ పొత్తుపై హర్షవర్ధన్ రెడ్డి విమర్శలు

ఏపీ మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధంచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సూర్యప్రకాశ్ రెడ్డి సోదరుడు, కోడుమూరు మాజీ ఎంపీపీ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. కోడుమూరులో తన అనుచరులతో సమావేశమైన హర్షవర్ధన్ రెడ్డి ఏ పార్టీలో చేరాలన్న విషయమై అభిప్రాయం కోరారు. వీరిలో మెజారిటీ సభ్యులు వైసీపీలో చేరాలని డిమాండ్ చేశారు.

దీంతో అనుచరుల అభీష్టానికి అనుగుణంగా తాను వైసీపీలో చేరతానని కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీతో కాంగ్రెస్ అనైతిక పొత్తును సహించలేకే తాను వైసీపీలోకి వెళుతున్నట్లు హర్షవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. తనను నమ్ముకున్న కార్యకర్తలు, అభిమానులను కాపాడుకోవాలంటే వైసీపీనే సరైన వేదిక అని వ్యాఖ్యానించారు.

ఆలూరు, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లోని అనుచరులు, మద్దతుదారులతో చర్చించి వచ్చే నెల 6న అనుచరులతో కలిసి వైసీపీలో చేరుతామని తెలిపారు. తన సోదరుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి నిర్ణయం తనను బాధించిందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమని వ్యాఖ్యానించారు.

More Telugu News