Andhra Pradesh: ఏపీ హైకోర్టు ఏర్పాటు విధానం రాజ్యాంగ విరుద్ధం.. దేశాన్ని ఆ దేవుడే కాపాడాలి!: జాస్తి చలమేశ్వర్ సంచలన వ్యాఖ్యలు

  • హైకోర్టు ఏర్పాటులో నిబంధనలు ఉల్లంఘించారు
  • ప్రారంభోత్సవానికి వెళ్లడం, వెళ్లకపోవడం సీజేఐ ఇష్టం
  • జాతీయ మీడియాతో మాట్లాడిన సుప్రీంకోర్టు మాజీ జడ్జి

ఏపీ హైకోర్టు ఏర్పాటుపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఏర్పాటు చేస్తున్న విధానం రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 3న ఏపీ తాత్కాలిక హైకోర్టు భవనం ప్రారంభోత్సవానికి వెళ్లాలా? వద్దా? అన్నది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తేల్చుకోవాలని స్పష్టం చేశారు. ఈ విషయమై ఓ జాతీయ మీడియా సంస్థతో జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడారు.

రాజ్యాంగం ప్రకారం హైకోర్టు ఏర్పాటుపై పార్లమెంటు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. పార్లమెంటు సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంటుందన్నారు. కానీ ఇక్కడ పార్లమెంటును పక్కనపెట్టి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నిర్ణయం తీసుకున్నారనీ, ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని విమర్శించారు. గతేడాది డిసెంబర్ 26న ఏపీ హైకోర్టు ఏర్పాటుపై కోవింద్ గెజిట్ ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే.

ఏపీ హైకోర్టు 2019, జనవరి 1 నుంచి ఉనికిలోకి వస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ చలమేశ్వర్ స్పందిస్తూ.. దేశంలోని ప్రతీ రాజ్యాంగ వ్యవస్థ ఇలా తయారయితే .. ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందన్న నమ్మకం తనకు లేదని కుండబద్దలు కొట్టారు. ఆ దేవుడే మన దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అన్నారు. 

More Telugu News