adhar: సందేహ నివృత్తికే ఆధార్‌ ఆధారం...తుది అంశం కాదు: అలహాబాద్‌ హైకోర్టు స్పష్టీకరణ

  • వేలిముద్రలు ధ్రువీకరించేందుకే పనికి వస్తుందని స్పష్టీకరణ
  • ఓ ప్రేమ వివాహం కేసు విచారణలో ఈ విధంగా వెల్లడి
  • తాము మేజర్లమని చెప్పేందుకు ఆధార్‌ చూపిన ప్రేమ జంట

సందేహ నివృత్తికి ఆధార్‌ కార్డు ఒక ఆధారం మాత్రమేనని, అదే తుది నిర్థారణ పత్రం కాదని అలహాబాద్‌ హైకోర్టు స్పష్టం చేసింది. ఏదైనా సందర్భంలో కార్డుదారుడి ఫొటో, వేలిముద్రలు, ఐరిస్‌ స్కాన్‌కు, ఆధార్‌ నంబర్‌కు మధ్య అనుసంధానం ఉందని ధ్రువీకరించేందుకు మాత్రమే ఇది పనికి వస్తుందని స్పష్టం చేసింది. ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట తాము మేజర్లమని చెప్పేందుకు ఆధార్‌ కార్డులో ఉన్న పుట్టిన రోజును చూపించింది. ఇద్దరి కార్డుల్లో సంవత్సరాలు వేర్వేరుగా ఉన్నా పుట్టిన తేదీ ఒక్కటే ఉంది. ఇంకా వారు అందజేసిన మరికొన్ని కార్డుల్లోనూ ఇలాగే ఉండడంతో ఇందుకు సంబంధించి యూఐడీఏఐ వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దీంతో లక్నోలోని యూఐడీఏఐ ప్రాంతీయ కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్‌ జాస్మిన్‌ కోర్టు ముందు హాజరై వివరణ ఇచ్చారు.

ఆధార్‌ నమోదు సమయంలో ఎవరైనా పుట్టిన రోజు చెప్పలేకుంటే సుమారుగా వయసు లెక్కగట్టి ఆపరేటర్లు ఓ సంవత్సరాన్ని నమోదు చేస్తారని వివరణ ఇచ్చారు. పుట్టిన తేదీ మాత్రం డిపాల్ట్‌గా ఆ క్యాలెండర్‌ ఇయర్‌ జనవరి ఒకటిగా నమోదవుతుందని చెప్పారు. ఈ వివరణ విన్న తరువాత కోర్టు ఆధార్‌ కార్డులోని పేరు, జెండర్‌, అడ్రస్‌, పుట్టిన తేదీలను తుది ఆధారాలుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. 

More Telugu News