KA Paul: అయ్యా పాల్.. క్రైస్తవుల పరువు బజారున పెట్టొద్దు: క్రిస్టియన్ పొలిటికల్ ఫ్రంట్ హితవు

  • అయితే మతబోధకుడిగా, లేదంటే రాజకీయ నేతగా ఉండండి
  • క్రైస్తవ ప్రతినిధిగా ఎక్కడా పాల్గొనవద్దు
  • ఎక్కువ చేస్తే క్రైస్తవ సమాజం నుంచి బహిష్కరణ తప్పదు

ప్రముఖ క్రైస్తవ మతబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై క్రిస్టియన్ పొలిటికల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మండిపడింది. తాను గొప్ప వాడినంటూ ప్రచారం చేసుకోవడం మానాలని హితవు పలికింది. ఉన్నదీ, లేనిదీ మాట్లాడి క్రైస్తవుల పరువు తీయొద్దని సూచించింది.

హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ఉన్న దేశోద్ధారక భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫ్రంట్ కన్వీనర్ జెరూసలెం మత్తయ్య మాట్లాడుతూ.. కేఏ పాల్ వుంటే రాజకీయాల్లోను, లేదంటే మతబోధకుడిగాను ఉండాలని, రెండింటిలోనూ ఉండొద్దని సూచించారు. రాజకీయాలకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో క్రైస్తవ ప్రతినిధిగా పాల్గొనవద్దని కోరారు.

క్రైస్తవ మతబోధకుడిగా ఉన్నప్పుడు ప్రధానులు, సీఎంలు, సినీ, వ్యాపార రంగాలకు చెందిన వారు వచ్చి నమస్కరించడానికి కారణం దైవ శక్తేనని, దానిని చులకన చేయవద్దని పాల్‌కు సూచించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా గురించి కానీ, రాజకీయ పార్టీలలో సీట్ల కోసం కానీ తాము ఏనాడూ అడగలేదన్నారు.

వార్తల్లో ఉండేందుకు రాజకీయ విమర్శలు చేస్తూ క్రైస్తవుల పరువు తీయవద్దని మత్తయ్య కోరారు. రాజకీయ పార్టీలకు క్రైస్తవులను తాకట్టుపెట్టాలనే ఆలోచన మానుకోవాలని హితవు పలికారు. మరోసారి ఇటువంటి ప్రయత్నాలు చేస్తే అడ్డుకుంటామని, క్రైస్తవ సమాజం నుంచి బహిష్కరిస్తామని మత్తయ్య హెచ్చరించారు.  

More Telugu News