narasimhan: ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది.. విభజన సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటోంది: గవర్నర్ నరసింహన్

  • రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి దిశగా కొనసాగుతోంది
  • సులభతర వాణిజ్యంలో దేశంలోనే నెంబర్ వన్ గా ఉంది
  • నిర్ణీత గడువులోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం
  • కాపులకు 5 శాతం రిజర్వేషన్లను ఇస్తాం

ఎన్నో పథకాలను అమలు చేస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం పని చేస్తోందని గవర్నర్ నరసింహన్ అన్నారు. విజయవాడ మున్సిపల్ మైదానంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను నరసింహన్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర విభజన కష్టాలను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి దిశగా కొనసాగుతోందని చెప్పారు.

ప్రతి గ్రామానికి రోడ్లను నిర్మించుకున్నామని గవర్నర్ ఈ సందర్భంగా తెలిపారు. విద్యుత్ కొరత ఉన్న రాష్ట్రాన్ని, మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంగా చేశామని చెప్పారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ ను ఇస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమం ద్వారా ఉచిత వైద్య సేవలను అందిస్తున్నామని చెప్పారు. సురక్షిత తాగునీటి కోసం వాటర్ గ్రిడ్ పథకాన్ని తీసుకొచ్చామని తెలిపారు.

సులభతర వాణిజ్యంలో దేశంలోనే తొలి స్థానంలో ఏపీ ఉందని నరసింహన్ చెప్పారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు వస్తున్నాయని తెలిపారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా పాలనను సులభతరం చేశామని చెప్పారు. రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా సాగుతోందని అన్నారు. నిర్ణీత గడువులోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి, గ్రావిటీ ద్వారా నీరు అందిస్తామని చెప్పారు. రాయలసీమను ఉద్యానవన హబ్ గా మార్చుతున్నామని తెలిపారు.

నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని నరసింహన్ చెప్పారు. క్రీడలను ప్రోత్సహించేందుకు ఎన్టీఆర్ క్రీడావికాసంను ఏర్పాటు చేశామని తెలిపారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లను ఇవ్వనున్నామని చెప్పారు. గత నాలుగున్నరేళ్లలో ఏపీలో గణనీయమైన అభివృద్ధి జరిగిందని అన్నారు. నిరుద్యోగులకు భృతి ఇస్తున్నామని తెలిపారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికీ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందిస్తున్నామని చెప్పారు. ఆదరణ పథకం కింద రూ. 964 కోట్లతో 4 లక్షల మందికి లబ్ధి చేకూరుతోందని తెలిపారు. 

More Telugu News