జేసీ దివాకర్ రెడ్డిపై మీసం మెలేసిన మాజీ సీఐ గోరంట్ల మాధవ్ వైసీపీలో చేరిక

26-01-2019 Sat 12:34
  • రాజకీయ అరంగేట్రం చేసిన గోరంట్ల మాధవ్
  • జగన్ సమక్షంలో వైసీపీలో చేరిక
  • నిబద్ధత, నిజాయతీ ఉన్న అధికారిగా పేరు 
గోరంట్ల మాధవ్... ఇటీవలి కాలంలో బాగా పాప్యులర్ అయిన వ్యక్తి. తాడిపత్రిలో సీఐగా పని చేస్తూ ఎంపీ దివాకర్ రెడ్డిపైనే మీసం మెలేసి, ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారారు. ఆ తర్వాత తన పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇటీవల అనంతపురంలో కురుబ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో కురుబలు, వివిధ నేతలతో పాటు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా హాజరయ్యారు. కానీ, ఉన్నట్టుండి అక్కడ మాధవ్ ప్రత్యక్షమయ్యారు. ఆ తర్వాత అక్కడ జరిగిన గొడవ కారణంగా... అక్కడి నుంచి సిద్ధరామయ్య అర్ధాంతరంగా వెళ్లిపోయారు.

ఇన్ని సంచలనాలకు కేంద్రబిందువైన గోరంట్ల మాధవ్ రాజకీయ అరంగేట్రం చేశారు. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. కానిస్టేబుల్ గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన మాధవ్ తొలినాళ్ల నుంచి కూడా వార్తల్లో నిలుస్తూనే వస్తున్నారు. రాజకీయ పార్టీలను అడ్డంపెట్టుకుని దందాలు చేసేవారిపై ఆయన కఠినంగా వ్యవహరించేవారు. వృత్తి పట్ల నిబద్ధత, నిజాయతీ ఆయనకు ప్రజల్లో మంచి క్రేజ్ ను సంపాదించిపెట్టాయి. ఇప్పుడు రాజకీయాల్లో ఆయన ఎంత వరకు సఫలీకృతమవుతారో వేచి చూడాలి.