Uttar Pradesh: ఎన్ని సున్నాలు కలిసినా సున్నాయే కదా అయ్యేది!: ప్రియాంక అరంగేట్రంపై యోగి సెటైర్‌

  • రెండు సున్నాలు కలిస్తే వంద కాదు కదా అని వ్యంగ్యోక్తి
  • ప్రియాంక ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చినట్టు కాంగ్రెస్‌ బిల్డప్‌ ఇస్తోంది
  • 2014-2017 ఎన్నికల్లో ఆమె చేసిన  ప్రచారం మాటేమిటి?

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సోదరి ప్రియాంక వాద్రా రాజకీయ అరంగేట్రంపై ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఎన్ని సున్నాలు కలిసినా మొత్తం సున్నాయే అయ్యేదన్నారు. ఇప్పుడు సున్నా, సున్నా కలిసినంత మాత్రాన వంద అవుతుందా? అని వ్యంగ్యోక్తులు విసిరారు. ప్రియాంకకు ఉత్తరప్రదేశ్‌ ఈస్ట్ బాధ్యతలు అప్పగిస్తూ కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే బీజేపీ పలు విమర్శలు చేసింది. యూపీ సీఎం మరికాస్త ముందుకు వెళ్లారు.

‘ప్రియాంక ఏదో ఇప్పుడే రాజకీయ ప్రవేశం చేసినట్లు కాంగ్రెస్‌ నాయకులు బిల్డప్‌ ఇస్తున్నారు. మరి 2014- 2017లో జరిగిన ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్‌ తరపున ప్రచారం చేసిన విషయం మర్చిపోయారా? అని ప్రశ్నించారు. ప్రియాంక రాకతో ఏదో జరిగిపోతుందన్నట్లు కాంగ్రెస్‌ నాయకులు హైప్‌ క్రియేట్‌ చేయాలని చూస్తున్నారని, ఆమె ప్రచారం చేసినా అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రత్యేకంగా కలిసిరాలేదని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ఆమె రాజకీయ ప్రవేశం వల్ల ఆ పార్టీకి ఒరిగేదేమీ ఉండదని జోస్యం చెప్పారు. 'కాకపోతే ఇప్పటి వరకు కాంగ్రెస్‌ పార్టీకి ఒక సున్నాయే ఉంది, ఇప్పుడు రెండో సున్నా జతకలిసింది, అంతే' అని ఎద్దేవా చేశారు.

More Telugu News