జైట్లీతో మాట్లాడా.. వేగంగా కోలుకుంటున్నారు: పీయూష్ గోయల్

26-01-2019 Sat 09:19
  • గత వారం అమెరికా వెళ్లిన అరుణ్ జైట్లీ
  • రెండు వారాల విశ్రాంతి అవసరమన్న వైద్యులు
  • తాత్కాలిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పీయూష్ గోయల్
వైద్య చికిత్స కోసం గతవారం అమెరికా వెళ్లిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ త్వరగానే కోలుకుంటున్నట్టు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన  మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. అరుణ్ జైట్లీ స్థానంలో తాత్కాలిక ఆర్థిక మంత్రిగా పీయూష్ గోయల్ బాధ్యతలు చేపట్టారు.

గత రాత్రి ఆయనతో మాట్లాడానని పేర్కొన్న గోయల్.. జైట్లీ త్వరగా కోలుకోవాలని, మరింత కాలం ఆయన సేవలు అందించాలని తనతోపాటు మీరు కూడా కోరుకోవాలని సూచించారు. జైట్లీ త్వరగా కోలుకుంటున్నట్టు చెప్పిన గోయల్.. ఆయన తిరిగి ఎప్పుడు బాధ్యతలు స్వీకరించనున్నారనే విషయాన్ని వెల్లడించలేదు.  

కాగా, వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లిన జైట్లీని పరీక్షించిన వైద్యులు, ఆయనకు రెండు వారాలపాటు విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో ఆయన అక్కడే ఉండిపోయారు. ఈ క్రమంలో పీయూష్ గోయల్ తాత్కాలిక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.