India: నెలకు రూ.66,666 సంపాదిస్తుంటే పేదలు ఎలా అవుతారు?: ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్

  • అగ్రవర్ణాలకు రిజర్వేషన్ ను తప్పుపట్టిన నేత
  • రూ.8 లక్షల వార్షికాదాయ పరిమితిపై అసహనం
  • ఈ నెల 12న చట్టానికి ఆమోదం తెలిపిన రాష్ట్రపతి

అగ్రకులాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్ తప్పుపట్టారు. ఈ చట్టంలో ఏడాదికి రూ.8 లక్షలలోపు ఆదాయం ఉన్నవారిని పేదలుగా పరిగణించాలని ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అసలు సంవత్సరానికి రూ.8 లక్షలు సంపాదించేవారిని పేదలుగా ఎలా పరిగణిస్తారని నిలదీశారు. ఎలాంటి అధ్యయనం, పరిశీలన చేయకుండా ఆదరాబాదరాగా కేంద్రం రిజర్వేషన్ ను తీసుకొచ్చిందని విమర్శించారు.

2016లో దేశానికి తీవ్ర నష్టం చేకూర్చిన పెద్దనోట్ల రద్దుకు కొనసాగింపుగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారని దుయ్యబట్టారు. ఏడాదికి రూ.8 లక్షలు అంటే నెలకు రూ.66,666 సంపాదనను ఆర్థిక వెనుకబాటుగా ఎలా పరిగణిస్తారని తేజస్వీ ప్రశ్నించారు. ఇంత ఆదాయం సంపాదించేవారు ఐటీ శాఖకు ఏటా రూ.72,500 పన్ను కడతారని వ్యాఖ్యానించారు.

షెడ్యూలు కులాలకు, ఓబీసీలకు రిజర్వేషన్ల పెంపు అంశాన్ని ఆయన లేవనెత్తారు. చాలాకాలంగా రిజర్వేషన్లు పెంచాలని తాము కోరుతున్నా కేంద్రం పట్టించుకోలేదని స్పష్టం చేశారు. అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం తెచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రపతి కోవింద్ ఈ నెల 12న ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే.

More Telugu News