IFLU: పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం... ఇఫ్లూ అధ్యాపకుడిపై విద్యార్థిని ఫిర్యాదు!

  • ఇఫ్లూలో చదువుతున్న కేరళకు చెందిన యువతి
  • అదే కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న కేరళ వ్యక్తి
  • ప్రేమ, పెళ్లి పేరిట మోసం చేశాడని ఫిర్యాదు

వివాహమై, భార్యతో విడాకులు తీసుకున్న ఓ అధ్యాపకుడు, తాను చదువు చెబుతున్న విద్యార్థినికి ప్రేమ పాఠాలు చెప్పి, నిలువునా మోసం చేశాడు. బాధితురాలు ఉస్మానియా పోలీసులకు వివరాలను వెల్లడిస్తూ, ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, తార్నాకలోని ఇఫ్లూ (ద ఇంగ్లీష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ)లో కేరళకు చెందిన ఓ అమ్మాయి చదువుతోంది.

ఇక్కడే కేరళకు చెందిన రంజిత్‌ తంగప్పన్‌ అసిస్టెంట్‌  ప్రొఫెసర్‌ గా పని చేస్తుండగా, ఒకే రాష్ట్రానికి చెందిన వారు కావడంతో ఇద్దరి మధ్యా పరిచయం ఏర్పడింది. అప్పటికే భార్యతో విడాకులు తీసుకున్న ఆయన, తనకు ఓ తోడు కావాలని విద్యార్థినిని నమ్మించాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఆమెను హాస్టల్ ఖాళీ చేయించి, తన ఇంటికి చేర్చి, సహజీవనం ప్రారంభించాడు.

అయితే, ఇటీవలి కాలంలో పెళ్లి విషయంలో ఆమె తరచూ ఒత్తిడి చేస్తుండడంతో, వారిద్దరి మధ్యా అభిప్రాయభేదాలు తలెత్తాయి. దీంతో ఈ నెల 12న అమెను కొట్టి, ఇంటి నుంచి గెంటేశాడు. ఆపై సెలవు పెట్టి కేరళకు వెళ్లిపోయాడు. అతనికి ఫోన్ చేసినా స్పందన రాకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News