Ghattamaneni: జగన్ కు ఎంత చెప్పినా, ఏం చెప్పినా లాభం లేదు!: ఘట్టమనేని ఆదిశేషగిరిరావు

  • కృష్ణ అభిప్రాయం తీసుకోకుండా ఏ పనీ చేయబోను
  • అసెంబ్లీకి దూరం కావద్దని చెప్పినా జగన్ వినలేదు
  • ఫిబ్రవరిలో నిర్ణయాన్ని ప్రకటిస్తానన్న అదిశేషగిరిరావు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు ఎంత చెప్పినా, ఏం చెప్పినా లాభం లేదని, అందువల్లే ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నానని సూపర్‌స్టార్‌ కృష్ణ సోదరుడు, ప్రిన్స్ మహేశ్ బాబు బాబాయి ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వ్యాఖ్యానించారు. నిన్న చంద్రబాబుతో చర్చలు జరిపిన తరువాత, ఆయన ఓ దిన పత్రికతో ప్రత్యేకంగా మాట్లాడారు. వైసీపీ అధినేతది ఒంటెద్దు పోకడ అనీ, నేతల అభిప్రాయాలకు ఏమాత్రం విలువ ఇవ్వరని అన్నారు.

వైసీపీలో విధానాలు, ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనకు నచ్చలేదని, గడచిన ఏడాదిగా ఎన్నో సూచనలు ఇచ్చినా పట్టించుకోలేదని చెప్పారు. ప్రజా ప్రతినిధులు అసెంబ్లీకి దూరంగా ఉండరాదని తాను చెప్పినా జగన్ వినలేదని, ప్రతిపక్షంగా వైసీపీ సరైన పాత్ర పోషించలేదని అన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో పోరాటం చేయకపోవడం దురదృష్టకరమని, రాష్ట్రానికి హోదా విషయంలోనూ వైసీపీ ఏమీ సాధించలేదని అన్నారు. జరిగిన పరిణామాలు తనకెంతో మనస్తాపం కలిగించాయని, సమస్యల గురించి ఎప్పటికప్పుడు జగన్‌ కు చెబుతూనే ఉన్నానని, 'సరే చూద్దామన్నా' అన్న మాట తప్ప మరో మాట రాలేదని, 'జనం నన్ను చూసి ఓటేస్తారు' అన్నట్టుగా జగన్ ఉన్నారని విమర్శించారు.

తన రాజకీయ భవిష్యత్తుపై ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని, టీడీపీలో చేరాలని ఇప్పటికిప్పుడు తొందరపడటం లేదని ఆదిశేషగిరిరావు వ్యాఖ్యానించారు. నిన్న చంద్రబాబును కలిసినప్పుడు కూడా ఈ విషయమై ఎటువంటి చర్చలనూ తాను జరపలేదని అన్నారు. వచ్చే నెల తొలివారంలో తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తన సోదరుడు కృష్ణ అనుమతి లేకుండా మాత్రం ఎటువంటి పని చేయబోనని స్పష్టం చేశారు. మహేశ్‌ కు మాత్రం రాజకీయాలకు దూరంగా ఉండమనే సలహా ఇస్తున్నానని అన్నారు. 

More Telugu News