Andhra Pradesh: గతంలో దొంగలు బంగారాన్ని దొంగలించేవారు.. ఇప్పుడు వైసీపీ పథకాలనూ దొంగిలిస్తున్నారు!: వైసీపీ నేత ఉమ్మారెడ్డి సెటైర్

  • కాపులను చంద్రబాబు మోసం చేస్తున్నారు
  • సగం రిజర్వేషన్ ఇచ్చే అధికారం సీఎంకు లేదు
  • కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ లో కాపులను మరోసారి మోసం చేసేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనీ వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. అగ్రకులాలకు కేంద్రం తీసుకొచ్చిన 10 శాతం రిజర్వేషన్ లో సగం కాపులకు ఇచ్చేందుకు కుదరదనీ, ఆ అధికారం చంద్రబాబుకు లేదని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి అసాధ్యమైన విషయాలను సుసాధ్యమని చెప్పడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ల పేరుతో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో దొంగలు బంగారం, నగదును దోచుకునేవారనీ, ఇప్పుడు మాత్రం నవరత్నాల పథకాలను దొంగలించేవారు తయారయ్యారని విమర్శలు గుప్పించారు. జగన్ ప్రకటించిన రూ.2 వేల పెన్షన్ పథకాన్ని చంద్రబాబు కాపీ కొట్టారని వ్యాఖ్యానించారు. జగన్ పై దాడి కేసులో ఎన్ఐఏ విచారణ అనగానే ఏపీ ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతోందని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతపై దాడి వెనుక ఏపీ ప్రభుత్వం కుట్ర ఉందని ఆరోపించారు.

More Telugu News