Rahul Gandhi: ఇటలీకి వెళ్లిపోండి: అమేథిలో రాహుల్ కు రైతుల సెగ

  • అమేథీలో నిన్న ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాహుల్
  • తమ భూమిని రాహుల్ కబ్జా చేశారంటూ రైతుల నిరసన
  • రాహుల్ కు ఇక్కడ ఉండే అర్హత లేదంటూ మండిపాటు

ఉత్తరప్రదేశ్ లోని తన సొంత నియోజకవర్గం అమేథీలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి రైతుల నిరసన సెగ తగిలింది. అమేథీ జిల్లాలోని గౌరీగంజ్ లో నిన్న రైతులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు తాము ఇచ్చిన భూమిని తిరిగి ఇవ్వాలని, లేనిపక్షంలో తమకు ఉపాధినైనా కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. నిన్న అమేథీలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు నిరసన సెగ తగిలింది.

నిరసనకారుడు సంజయ్ సింగ్ ఈ సందర్భంగా ఏఎన్ఐతో మాట్లాడుతూ, రాహుల్ గాంధీ తీరుతో తాము చాలా కలతచెందుతున్నామని అన్నారు. అతను ఇటలీ వెళ్లిపోవడం మంచిదని చెప్పారు. ఇక్కడ ఉండే అర్హత రాహుల్ కు లేదని అన్నారు. తమ భూములను రాహుల్ కబ్జా చేశారని ఆరోపించారు.

వివాదం వివరాల్లోకి వెళ్తే... సామ్రాట్ సైకిల్ ఫ్యాక్టరీ సమీపంలో రైతులు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ఫ్యాక్టరీకి అప్పటి ప్రధాని (అమేథీ ఎంపీ) రాజీవ్ గాంధీ ప్రారంభోత్సవం చేశారు. కౌసర్ ఏరియాలో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాలో 1980లో ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం జైన్ సోదరులు 65.57 ఎకరాల భూమిని తీసుకున్నారు. ఆ తర్వాత ఫ్యాక్టరీ కార్యకలాపాలు ఆగిపోవడంతో 2014లో ఆ భూమిని వేలం వేశారు. రికార్డుల ప్రకారం 1986లో ఫ్యాక్టరీ మూతపడే సమయానికి యూపీ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (యూపీఎస్ఐడీసీ) ఈ భూమిని సదరు కంపెనీకి లీజుకు ఇచ్చినట్టు ఉంది.

అప్పులను రికవర్ చేసుకునే క్రమంలో 2014లో రూ. 20.10 కోట్లకు డెట్ రికవరీ ట్రైబ్యునల్ ఆ భూమిని వేలం వేసింది. రూ. 1.50 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించి ఈ భూమిని రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ సొంతం చేసుకుంది.

ఆ తర్వాత ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. ఈ నేపథ్యంలో, భూమిని సామ్రాట్ సైకిల్ ఫ్యాక్టరీకే ఇవ్వాలంటూ గౌరీగంజ్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును వెలువరించింది. దీంతో, వేలం పాట చెల్లదంటూ యూసీఎస్ఐడీసీ ప్రకటించింది. ప్రస్తుత రికార్డుల ప్రకారం ఆ భూమి యూపీఎస్ఐడీసీ పేరు మీదే ఉన్నప్పటికీ... రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ తన అధీనంలో ఉంచుకుంది. రైతుల భూమిని ఫౌండేషన్ పేరుతో రాహుల్ గాంధీ కబ్జా చేశారంటూ ఇంతకు ముందు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా విమర్శించారు.

More Telugu News