Nellore District: నెల్లూరులో ఛేజ్ చేసి కారును పట్టుకున్న ఎస్ఐ.. కారులో కుప్పలు తెప్పలుగా నోట్ల కట్టలు!

  • తడ వద్ద కారును పట్టుకున్న పోలీసులు
  • కారులో మొత్తం రూ. 6.5 కోట్ల నగదు
  • నగల వ్యాపారి పేరు చెప్పిన నిందితులు

నెల్లూరులో ఓ కారులో తరలిస్తున్న రూ. 6.5 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి కారులో ఇద్దరు వ్యక్తులు బుధవారం చెన్నై వైపుగా వెళ్తున్నారు. ఎస్సై దాసరి వెంకటేశ్వరరావు సూళ్లూరుపేట నుంచి వస్తూ చేనిగుంట వద్ద ఓ కారు వేగంగా వెళ్తుండడాన్ని గమనించారు. కారులోని డ్రైవర్, మరో వ్యక్తి కంగారుగా ఉన్నట్టు అనిపించడంతో అనుమానం వచ్చిన ఎస్సై కారును ఛేజ్ చేసి తడ వద్ద కారును ఆపారు.

అనంతరం కారును క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు అందులో కుప్పలు తెప్పలుగా బయటపడిన కరెన్సీ నోట్లను చూసి ఆశ్చర్యపోయారు. సీట్ల కింద, డిక్కీలో రూ. 500, రూ. 2000 నోట్ల కట్టలు బయటపడ్డాయి. వెంటనే కారును పోలీస్ స్టేషన్‌కు తరలించి ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమాచారం అందించారు. విదేశీ కరెన్సీతో కలిపి మొత్తం రూ.6.5 కోట్లుగా ఆ డబ్బును లెక్క తేల్చారు. అలాగే, నిందితుల నుంచి 55 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

నిందితులను మాచినీడు కనక సురేశ్, చేమకూరి హరిబాబుగా పోలీసులు గుర్తించారు. నరసాపురానికి చెందిన జైదేవి నగల వ్యాపారి ప్రవీణ్ కుమార్ జైన్ ఆదేశాలతోనే తాము నగదును చెన్నై తరలిస్తున్నట్టు నిందితులు చెప్పారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News