Congress: యూపీలో దారుణంగా బీజేపీ పరిస్థితి.. ఇండియా టుడే-కార్వీ సర్వేలో వెల్లడైన షాకింగ్ విషయాలు!

  • గుబులు రేపుతున్న ఎస్పీ-బీఎస్పీ కూటమి
  • 18 సీట్లకే పరిమితం కానున్న బీజేపీ-అప్నాదళ్ కూటమి
  • ఎస్పీ-బీఎస్పీ కూటమికి 58 సీట్లు

లోక్‌సభ ఎన్నికల్లో కీలకం కానున్న ఉత్తరప్రదేశ్‌పై పట్టు సాధించాలన్న బీజేపీ కోరిక నెరవేరేలా కనిపించడం లేదు. యూపీలో మెజార్టీ సీట్లను గెలుచుకోవడం ద్వారా మళ్లీ అధికారంలోకి రావాలన్న బీజేపీ ఆశలకు గండి పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఇండియా టుడే-కార్వీ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇండియా టుడే-కార్వీ నిర్వహించిన 'మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్' సర్వే కోసం దాదాపు 2400 నుంచి అభిప్రాయాలు సేకరించారు.

ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మిత్రం పక్షం అప్నాదళ్‌తో కలిసి బీజేపీ 18 సీట్లకే పరిమితం అవుతుందని సర్వే తేల్చింది. ఎస్పీ-బీస్పీ-ఆర్ఎల్‌డీల కూటమి 58 సీట్లను గెలుచుకుంటుందని పేర్కొంది. కాంగ్రెస్‌కు నాలుగు సీట్ల వరకు వస్తాయని తెలిపింది. గత ఎన్నికల్లో 71 స్థానాల్లో విజయ దుందుభి మోగించిన బీజేపీ ఈసారి 16 స్థానాలకు పరిమితం అవుతుందని సర్వే నివేదిక వివరించింది.

గత ఎన్నికల్లో ఐదు స్థానాలు మాత్రమే గెలుచుకున్న ఎస్పీ, ఒక్క స్థానంలోనూ విజయం సాధించని బీఎస్పీ ప్రభ ఈసారి వెలిగిపోతుందని, రెండూ కలిపి 58 స్థానాలను కైవసం చేసుకుంటాయని సర్వేలో వెల్లడైంది. గత ఎన్నికల్లో రెండు స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ ఈసారి మరో రెండు సీట్లను ఎక్కువగా గెలుచుకుంటుందని తేలింది.

సర్వేలో వెల్లడైన మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఎస్పీ-బీఎస్పీ కూటమిలో కాంగ్రెస్ కూడా ఉండి ఉంటే బీజేపీ పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని, ఆ పార్టీ ఐదు స్థానాలకే పరిమితమయ్యేదని సర్వే వివరించింది. ఓట్ల శాతం విషయానికి వస్తే ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీ పక్షానికి 46 శాతం, బీజేపీ-అప్నాదళ్ కూటమికి 36 శాతం, కాంగ్రెస్‌కు 12 శాతం ఓట్లు పడతాయని సర్వే పేర్కొంది.

More Telugu News