Andhra Pradesh: మీ బలాలు, బలహీనతలు ఇవిగో.. పార్టీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు ముఖాముఖి!

  • అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం
  • రోజుకు 15 మందితో బాబు సమావేశం 
  • తొలి రోజున శిద్ధా సహా పలువురితో భేటీ

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైన, ప్రజామోదం ఉన్న అభ్యర్థులను మాత్రమే బరిలో నిలపాలన్న ఉద్దేశంతో ఉన్నారు. ఈ క్రమంలో రోజుకు 15 మందితో భేటీ అయి, ఎన్నికలపై చర్చించాలని నిర్ణయించుకున్న ఆయన, తొలిరోజు సమావేశంలో పలువురు ఎమ్మెల్యేల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలతో ముఖాముఖి అయిన బాబు, వారివారి బలాలు, బలహీనతలతో కూడిన నివేదికను వారి ముందుంచారు. పరిస్థితి బాగాలేదని నివేదిక వచ్చిన ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు. ఎమ్మెల్యేలు మారకుంటే తాను ఏమీ చేయలేనని అన్నారు.

మంత్రి శిద్ధా రాఘవరావు సహా 15 మందితో సమావేశమైన చంద్రబాబు, వారిపై ప్రజలకు ఉన్న అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఈ నివేదికల్లోని చాలా విషయాలు తనకు ఎన్నడో తెలుసునని, ఆ సమాచారాన్ని ముందే చెబితే, ఇచ్చిన వారిపై దండెత్తుతారన్న ఉద్దేశంతోనే చెప్పలేదని, ఇక సమయం వచ్చింది కాబట్టే అన్ని విషయాలనూ బయట పెట్టాల్సి వస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కొందరు ఎమ్మెల్యేల పనితీరు బాగున్నా, ప్రజలతో సంబంధాలను నెరపడంలో విఫలమయ్యారని, ఇంకొందరు వివాదాల్లో చిక్కుకున్నారని గుర్తు చేసిన ఆయన, తాను లోపాలను చెబుతున్నానని, వాటిని దిద్దుకుంటేనే మంచి జరుగుతుందని, లేకుంటే నష్టపోక తప్పదని హెచ్చరించారు.

కాగా, ఈ భేటీలో పాల్గొన్న 15 మంది ఎమ్మెల్యేలూ బయటకు వచ్చిన తరువాత గంభీరంగా కనిపించారు. చంద్రబాబు చెప్పిన విషయాలన్నీ తమకు తెలుసునని, కొందరు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని, లోపాలుంటే సరిచేసుకుంటామని చెప్పడం గమనార్హం.

More Telugu News