Gun: తుపాకిలోని సేఫ్టీ ఫీచర్లను స్నేహితులకు వివరిస్తూ తలలో కాల్చుకున్న యువకుడు!

  • ఆత్మరక్షణ కోసం తుపాకి కొనుగోలు
  • స్నేహితులకు చూపించే క్రమంలో ప్రమాదం
  • ఆసుపత్రిలో వదిలేసి పరారైన స్నేహితులు

తుపాకిలోని సేఫ్టీ ఫీచర్ల గురించి స్నేహితులకు వివరిస్తూ తనను తాను కాల్చుకున్నాడో వ్యక్తి. ఢిల్లీలో జరిగిందీ ఘటన. అమిత్ కుమార్ (32) అనే వ్యక్తి పిస్టల్‌ను కొనుగోలు చేసి తీసుకొచ్చాడు. దానికి సంబంధించిన సేఫ్టీ ఫీచర్ల గురించి వివరిస్తూ ప్రమాదవశాత్తు తలలో కాల్చుకుని మృతి చెందాడు. పిస్టల్ బ్యారెల్‌లో బుల్లెట్ చిక్కుకుపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు తేల్చారు.

తుపాకి గురించి స్నేహితులకు వివరించే క్రమంలో ముందు జాగ్రత్తగా బుల్లెట్లను నింపే మ్యాగజైన్‌ను తుపాకి నుంచి తీసి వేశాడు. అనంతరం తుపాకిని తన తలకు గురిపెట్టుకుని ట్రిగ్గర్ నొక్కాడు. అంతే, లోపల చిక్కుకుపోయిన బుల్లెట్ అతడి కణతలోంచి దూసుకెళ్లింది. ఘటనా స్థలంలోనే కుప్పకూలిన కుమార్‌ను చూసిన స్నేహితులు నిశ్చేష్టులయ్యారు. షాక్ నుంచి తేరుకుని వెంటనే బాత్రా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ స్ట్రెచర్‌పై అతడిని పడేసి పరారయ్యారు.

అనంతరం కుమార్ స్నేహితుల్లో ఒకరు ఆయన ఇంటికి వెళ్లి కుమార్ సోదరుడికి పిస్టల్ అప్పజెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి స్నేహితుడు బబ్లూను కలిసేందుకు సంగం విహార్ వెళ్లిన కుమార్ అక్కడ బబ్లూతో కలిసి బీరు తాగాడు. అనంతరం ఇంటికి వెళ్తూ మార్గమధ్యంలో మరో స్నేహితుడు రజ్‌నీష్‌ను కలిశారు. కుమార్ దగ్గరున్న పిస్టల్‌ను చూసిన రజ్‌నీష్.. దానిని ఆత్మరక్షణ కోసం కొనుగోలు చేసినట్టు చెబుతూ అందులోని సేఫ్టీ ఫీచర్ల గురించి వారికి వివరించాడు. ఈ క్రమంలో ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News