new zealand: న్యూజిలాండ్ లో బోణీ కొట్టిన టీమిండియా.. కివీస్ చిత్తు

  • 157 పరుగులకు ఆలౌట్ అయిన న్యూజిలాండ్
  • 4 వికెట్లు కూల్చిన కుల్దీప్ యాదవ్
  • 75 పరుగులతో నాటౌట్ గా నిలిచిన ధావన్

న్యూజిలాండ్ టూర్ ను టీమిండియా ఘనంగా ప్రారంభించింది. ఐదు వన్దేల సిరీస్ లో భాగంగా నేపియర్ లో జరిగిన తొలి వన్డేలో కివీస్ ను కోహ్లీ సేన చిత్తు చేసింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని మరో 14.5 ఓవర్లు ఉండగానే టీమిండియా ఛేదించింది.

అంతకు ముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ ధాటికి 18 పరుగులకే కివీస్ ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ చేరారు. ఆ తర్వాత స్పిన్నర్ చాహల్ దెబ్బకు మరో రెండు వికెట్లు నేలకూలాయి. దీంతో 76 పరుగులకే కివీస్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. వన్ డౌన్ లో వచ్చిన విలియంసన్ మాత్రం ఒంటరి పోరాటం (64 పరుగులు) చేసి స్కోరు బోర్డును కొంచెం ముందుకు కదిలించాడు. జట్టులో మరెవరూ భారత బౌలర్ల ముందు నిలబడలేక పోయారు. ఈ నేపథ్యంలో కేవలం 38 ఓవర్లలో 157 పరుగులకు కివీస్ ఆలౌట్ అయింది.

కివీస్ బ్యాట్స్ మెన్లలో గుప్టిల్ 5, మన్రో 8, విలియంసన్ 64, టేలర్ 24, లాథమ్ 11, నికోల్స్ 12, శాంట్నర్ 14, బ్రేస్ వెల్ 7, సోథీ 9, ఫెర్యూసన్ డకౌట్, బౌల్ట్ 1 పరుగు చేశారు. సౌథీ నాటౌట్ గా నిలిచాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4, షమీ 3, చాహల్ 2 వికెట్లు తీయగా, జాధవ్ ఒక వికెట్ సాధించాడు.

అనంతరం 158 పరుగుల విజయలక్ష్యంతో టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బ్రేస్ వెల్ బౌలింగ్ లో గుప్టిల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన కోహ్లీ 45 పరుగులు చేసి ఫెర్యూసన్ బౌలింగ్ లో కీపర్ లాథమ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

మరోవైపు, ఓపెనర్ ధావన్ సమయోచితంగా ఆడుతూ 103 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 75 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ క్రమంలో వన్డేల్లో ధావన్ 26వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ధావన్ కు తోడుగా మరో వికెట్ పడకుండా అంబటి రాయుడు 13 పరుగులతో నాటౌట్ గా నిలబడ్డాడు. మరోవైపు భారత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వెలుతురు కారణంగా కాసేపు ఆటకు అంతరాయం కలిగింది. దీంతో భారత్ విజయలక్ష్యాన్ని 49 ఓవర్లలో 156 పరుగులుగా నిర్ణయించారు. ఈ లక్ష్యాన్ని 34.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి భారత్ ఛేదించింది. 6 ఓవర్లలో 2 మెయిడెన్లు వేసి 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసిన షమీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు.

More Telugu News