Telangana: అప్పట్లో కిషన్ రెడ్డి 11 మందిని చంపించారు!: హ్యాకర్ షుజా సంచలన ఆరోపణలు

  • గన్ మెన్లతో చంపించి మతకలహాలుగా చూపారు
  • త్రుటితో తప్పించుకుని పారిపోయాను
  • ఈవీఎంలో బగ్ పెట్టాలని కాంగ్రెస్ నేత కోరారు

2014 లోక్ సభ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)ను హ్యాక్ చేసి బీజేపీ గెలిచిందని భారత హ్యాకర్ సయ్యద్ షుజా ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా షుజా మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కిషన్ రెడ్డి ఆదేశాలతో ఆయన గన్ మెన్లు 2014, మే 13న తమపై కాల్పులు జరిపారనీ, అందులో 11 మంది చనిపోయారని బాంబు పేల్చారు. ఈ ఘటనకు మతకలహాలుగా కలరింగ్ ఇచ్చారని ఆరోపించారు. ఉప్పల్ లిటిల్‌ ఫ్లవర్‌ కాలేజి దగ్గర కిషన్ రెడ్డి బావమరిది కాకిరెడ్డికి చెందిన గెస్ట్ హౌస్ లో ఈ ఘటన చోటుచేసుకుందన్నారు.

ఈ కాల్పుల నుంచి తాను తప్పించుకోగా, సమావేశం ఏర్పాటు చేసిన కమల్ రావు కూడా కాల్పుల్లో చనిపోయారని షాకింగ్ ప్రకటన చేశారు. తాను విన్ సొల్యూషన్స్ ద్వారా ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐఎల్) కు సాంకేతిక సహకారం అందించానని తెలిపారు. అమెరికాలో తనను ప్రముఖ జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామితో పాటు కాంగ్రెస్ నేతలు మనీశ్ సిసోడియా, వంశీరెడ్డి కలిశారని అన్నారు.

తాను ఈసీఐఎల్ లో పనిచేసే సమయంలో ఈవీఎం యంత్రాల్లో ఓ వైరస్ లేదా బగ్ ను ఎక్కించాల్సిందిగా వంశీరెడ్డి కోరారని చెప్పారు. వీరిలో వంశీరెడ్డిని బస్సు ప్రమాదం పేరుతో చంపేశారని ఆరోపించారు. తాను షాదాన్ కాలేజీలో బీటెక్ చేశానని చెప్పారు. అయితే విన్‌ సొల్యూషన్స్‌లో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. రిలయన్స్ జియో సంస్థ సాయంతో ఈవీఎంలను బీజేపీ హ్యాక్ చేసిందని ఆరోపించిన షుజా అందుకు తగిన సాక్ష్యాలను మాత్రం చూపలేదు.

More Telugu News