Andhra Pradesh: ఎస్పీ, బీఎస్పీలే కలిసినప్పుడు టీడీపీ-జనసేన కలిస్తే తప్పేంటి?: టీజీ వెంకటేశ్

  • టీడీపీ-జనసేన మధ్య విభేదాలు లేవు
  • కేంద్రంపై పోరాటంలో తేడాలు ఉన్నాయి
  • మీడియాతో మాట్లాడిన టీడీపీ నేత

టీడీపీ నేతలు టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాప్ రెడ్డి ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో సీట్ల కేటాయింపు విషయమై ముఖ్యమంత్రితో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం బయటకు వచ్చిన టీజీ వెంకటేశ్ మీడియాతో మాట్లాడారు. కర్నూలు అసెంబ్లీ సీటుపై సర్వేల ఆధారంగానే పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. సర్వేల్లో టీజీ భరత్ కు మెజారిటీ వస్తే ఆయనకే సీటు ఇవ్వాలనీ, ఒకవేళ ఎస్వీ మోహన్ రెడ్డికి వస్తే ఆయనకు ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా టీడీపీ-జనసేన పొత్తుపై టీజీ వెంకటేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య పెద్దగా విభేదాలు లేవని ఆయన తెలిపారు. కేవలం కేంద్రంపై పోరాడే విషయంలోనే ఇరు పార్టీల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. తనకు సీఎం పదవిపై ఆశ లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

ఉత్తరప్రదేశ్ లో ఉప్పు-నిప్పులా ఉన్న సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ)- బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) కలిసినప్పుడు ఏపీలో టీడీపీ-జనసేన కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఏపీలో జనసేన, టీడీపీ కలిసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు గెలిచేవాళ్లకే అవకాశాలు ఇస్తారనీ, తన కుమారుడు భరత్ కు ఛాన్స్ ఇస్తారని భావిస్తున్నట్లు తెలిపారు.

More Telugu News