locla pols: పంచాయతీ ఎన్నికల బరిలో తోడికోడళ్లు...ఎవరు గెలిచినా పదవి ఆ కుటుంబానిదే!

  • ఆసిఫాబాద్‌ జిల్లా చోర్‌పల్లి పంచాయతీలో ప్రత్యేకం
  • ఎస్టీలకు కేటాయించిన నూతన పంచాయతీ
  • ఒకరు టీఆర్‌ఎస్‌, మరొకరు కాంగ్రెస్‌ మద్దతుదారులు

తెలంగాణలోని ఆసిఫాబాద్‌ జిల్లా చోర్‌పల్లి పంచాయతీ ఎన్నికల్లో తోడికోడళ్ళే సర్పంచ్‌ పదవి కోసం ఢీ అంటే ఢీ అంటున్నారు. నూతనంగా ఏర్పడిన ఈ పంచాయతీని ఎస్టీలకు కేటాయించడంతో ఒకే కుటుంబానికి చెందిన వారు పోటీ పడే పరిస్థితి నెలకొంది.  స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది షరామమూలే అయినా రిజర్వేషన్‌ పుణ్యాన గత కొన్నేళ్లుగా ఒకే కుటుంబానికి చెందిన వారిని సర్పంచి పదవులు వరిస్తుండడం ఇక్కడి విశేషం. పంచాయతీ పరిధిలోని నందుపా గ్రామానికి చెందిన తోడికోడళ్లు కమ్మరి మంజుల కాంగ్రెస్‌ మద్దతు అభ్యర్థినిగా, కమ్మరి రోజా అధికార టీఆర్‌ఎస్‌ మద్దతుతో పోటీచేస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో ఎవరు గెలిచినా పదవి ఆ కుటుంబాన్నే వరించినట్లు.

గతంలో రహపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న నందుప గ్రామం పునర్విభజనలో భాగంగా చోర్‌పల్లిలోకి చేరింది. పంచాయతీలో ఒకే ఒక ఎస్టీ కుటుంబం ఉండడంతో  ఆ కుటుంబానికి చెందిన వారే ప్రత్యర్థులుగా బరిలో ఉంటున్నారు. గతంలో కూడా నందుపా గ్రామానికి చెందిన కమ్మరి భీమయ్య కుటుంబ సభ్యులు కమ్మరి మొండయ్య, కమ్మరి చిన్నన్న, కమ్మరి బాయక్క, కమ్మరి పోచయ్యలు సర్పంచ్‌లుగా పనిచేశారు. పంచాయతీలో 952 మంది ఓటర్లు ఉండగా, 478 మంది పురుషులు, 474 మంది మహిళలు ఉన్నారు.

More Telugu News