Hemamalini: హేమమాలిని లైవ్ పెర్ఫార్మెన్స్ చూసి ఫిదా అయిన సుష్మా స్వరాజ్!

  • వారణాసిలో ప్రారంభమైన ప్రవాస భారతీయ దివస్
  • సాంస్కృతిక కార్యక్రమాల్లో 'మా గంగా'
  • నది పుట్టుక, కలుషితమవుతున్న తీరును కళ్లముందుంచిన హేమమాలిని
  • అద్భుత ప్రదర్శనని కొనియాడిన సుష్మా స్వరాజ్

వారణాసిలో నిన్న ప్రారంభమైన ప్రవాస భారతీయ దివస్ కార్యక్రమంలో బీజేపీ నేత, ప్రముఖ బాలీవుడ్ నటి హేమమాలిని చేసిన నృత్యానికి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ఫిదా అయ్యారు. 'మా గంగా' థీమ్ పై హేమమాలిని నృత్యం చేయగా, 90 నిమిషాల పాటు సాగిన కార్యక్రమాన్ని ఆసాంతం తిలకించిన సుష్మా, ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు.

గంగా నది చరిత్రను ఆమె తన కళ్లముందుంచారని, నది ఎలా కలుషితం అవుతుందన్న అంశాన్ని చక్కగా చూపించారని కొనియాడారు. ఆమె లైవ్ పెర్ఫార్మెన్స్ చూసిన తరువాత, తనకు మాటలు రావడం లేదని, ఇంత అద్భుత ప్రదర్శనను తాను తొలిసారిగా చూస్తున్నానని అన్నారు. ఊహించలేనంత అద్భుత ప్రదర్శనను ఆమె ఇచ్చారని అన్నారు.

కాగా, ఈ నృత్యాన్ని అసిత్ దేశాయ్, ఆయన కుమారుడు అలాప్ దేశాయ్ కంపోజ్ చేయగా, పాటలను సురేష్ వాడేకర్, కవితా కృష్ణమూర్తి, శంకర్ మహదేవన్, మీకాసింగ్ లు పాడారు. నీతాలుల్లా డిజైన్ చేసిన దుస్తులతో హేమమాలిని మెరిసిపోగా, విభోరీ ఖండేల్ వాల్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఆహూతులను అలరించాయి.

More Telugu News