BCCI: ప్రాణాల కోసం పోరాడుతున్న మాజీ క్రికెటర్ కు బ్లాంక్ చెక్ పంపిన కృనాల్ పాండ్యా!

  • వడోదరా ఆసుపత్రిలో జాకబ్ మార్టిన్ కు చికిత్స
  • సాయం చేసేందుకు ముందుకు వస్తున్న క్రికెట్ కుటుంబం
  • రూ. 5 లక్షలు పంపించిన బీసీసీఐ

డిసెంబర్ 28న జరిగిన రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ప్రాణాలకోసం వడోదరా ఆసుపత్రిలో పోరాడుతున్న మాజీ ఇండియన్ క్రికెటర్ జాకబ్ మార్టిన్ ను ఆదుకునేందుకు ఎంతోమంది ముందుకు వచ్చిన వేళ, క్రికెటర్ కృనాల్ పాండ్యా ఓ బ్లాంక్ చెక్ ను పంపించి, తన మంచి మనసును చాటుకున్నాడు. "సార్... ఈ ఖాళీలో మీకు కావాల్సినంత రాసుకోండి. అది లక్షకు తక్కువ మాత్రం కాకూడదు" అంటూ చెక్కును బరోడా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సంజయ్ పటేల్ కు పంపారు.

జాకబ్ మార్టిన్ ఊపిరితిత్తులు, కిడ్నీలు ఈ ప్రమాదంలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. అతనికి సాయంగా ఇప్పటికే బీసీసీఐ రూ.5 లక్షలు, బరోడా క్రికెట్ అసోసియేషన్ రూ. 3 లక్షలు ధన సహాయం చేశాయి. "మార్టిన్ కుటుంబం ఎవరినైనా సహాయం అడగాలా? వద్దా? అన్న మీమాంసలో ఉంది. వారిప్పుడు ఎవరినీ అడిగే పరిస్థితుల్లో లేరు. విషయం తెలుసుకున్న ఎవరికి వారు సొంతంగానే స్పందిస్తున్నారు" అని పటేల్ తెలిపారు. టీమిండియా, రవిశాస్త్రి కూడా సాయం చేస్తామని హామీ ఇచ్చారని, జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, మునాఫ్ పటేల్ ఇప్పటికే తమవంతు సాయం చేశారని అన్నారు. కాగా, గంగూలీ కెప్టెన్ గా ఉన్న 1999 సంవత్సరంలో టీమిండియా తరఫున 10 వన్డేలను ఆడాడు మార్టిన్.

More Telugu News