Andhra Pradesh: అమరావతికి చేరుకున్న కడప జిల్లా టీడీపీ నేతలు.. ఆచూకీ లేకుండా పోయిన ఎమ్మెల్యే మేడా!

  • తానే మేడాను ఆహ్వానించానన్న సీఎం రమేశ్
  • ఫోన్ లో వస్తానని చెప్పి ఎగ్గొట్టారని ఆగ్రహం
  • ఇది పార్టీకి ద్రోహం చేయడమేనని వ్యాఖ్య

కడప జిల్లాలో టీడీపీ రాజకీయం రసవత్తరంగా మారింది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీకి రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డిని తాను ఆహ్వానించానని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ తెలిపారు. తనతో పాటు వస్తానని ఫోన్ లో హామీ ఇచ్చిన మేడా ఇప్పుడు పత్తా లేకుండా పోయారని విమర్శించారు. ఏది ఏమైనా టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. అమరావతిలో ఈరోజు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో కడపలో మైనారిటీలు టీడీపీకి దూరం అయ్యారని సీఎం రమేశ్ అన్నారు. అయితే ఈసారి జిల్లాలో మెజారిటీ స్థానాలు దక్కించుకుంటామని స్పష్టం చేశారు. మేడా పార్టీలోకి రాగానే ప్రభుత్వ విప్, టీటీడీ బోర్డు పదవి, నియోజకవర్గానికి ఏది కావాలంటే అది ఇచ్చామని గుర్తుచేశారు. ఇంతచేసిన పార్టీకి ఇప్పుడు ద్రోహం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. చంద్రబాబును కలుసుకునేందుకు రాజంపేట కార్యకర్తలు, నేతలు అమరావతికి వచ్చారన్నారు. స్థానిక ప్రజలు, కార్యకర్తల కోరిక మేరకు ముఖ్యమంత్రి మంచి నిర్ణయాన్ని తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

More Telugu News