Buddha Venkanna: తండ్రులు కొట్టుకుంటున్న వేళ... వంగవీటి రాధకు ఏడేళ్లు, దేవినేని అవినాష్ కు ఏడు నెలలు: ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న

  • తండ్రుల ఫ్యాక్షన్ మనస్తత్వం పిల్లలకు రాలేదు
  • ప్రజలకు సేవ చేయాలన్నదే రాధ, అవినాష్ ల అభిప్రాయం
  • ఎవరికీ అన్యాయం జరగబోదన్న వెంకన్న

విజయవాడ ఫ్యాక్షన్ రాజకీయాల పేరు చెబితే, తొలుత గుర్తుకు వచ్చేది దేవినేని, వంగవీటి కుటుంబాలే. ఈ రెండు కుటుంబాల మధ్య పగలు, ప్రతీకార హత్యలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు పెను సంచలనమే. అయితే, మారిన కాలం, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ఇప్పుడు రెండు కుటుంబాలూ ఒకే పార్టీలో కొనసాగాల్సిన పరిస్థితి. సుదీర్ఘకాలంగా దేవినేని నెహ్రూ కుటుంబం టీడీపీలో కొనసాగుతుండగా, దివంగత వంగవీటి మోహనరంగా కుమారుడు వంగవీటి రాధ అదే పార్టీ కండువాను కప్పుకునేందుకు సిద్ధమయ్యారు.

రాధా వస్తే, తమ కుటుంబానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్న ఆలోచనలో ఉన్న దేవినేని, ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు వద్ద ప్రస్తావించిన వేళ, ఆయన ఎలా అనునయించారన్న విషయాన్ని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మీడియాకు వివరించారు.

"దేవినేని అవినాష్ కు అన్యాయం అనేదే జరుగదు. ఎందుకంటే వాళ్ల నాన్నగారు తెలుగుదేశం పార్టీలో ఓ ఫౌండర్. రాధాకుగానీ, అవినాష్ కు గానీ ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. అయితే, ఎవరి సిద్ధాంతాల్లో వాళ్లు వెళుతుంటారు. వీరిద్దరూ చిన్న పిల్లలే. వాళ్ల తండ్రులు ఫ్యాక్షన్ లో ఉన్నప్పుడు... నాకు తెలుసు రెండు కుటుంబాలు... రాధాకేమో ఏడు సంవత్సరాలు, అవినాష్ కు ఏడు నెలలు.

అయితే, ఈ పిల్లలిద్దరి మనస్తత్వం కూడా ఆ ఫ్యాక్షన్ మనస్తత్వం కాదు. ప్రజలకు సేవ చేద్దామన్న మనస్తత్వం తప్ప, ఫ్యాక్షన్ కు ఇద్దరూ దూరంగానే ఉంటారు. అవినాష్ కు ఇప్పటికే తెలుగుయువత పదవిని ఇచ్చారు. రేపు ఎన్నికల్లో కూడా ఏదో ఒకచోట అవకాశం కల్పిస్తారు. దాంట్లో సమస్యే లేదు" అని అన్నారు. ఈ మేరకు దేవినేని ఫ్యామిలీకి చంద్రబాబు హామీ ఇచ్చారని, ఇక రాదా 25న టీడీపీలో చేరతారని చెప్పారు.

More Telugu News