Andhra Pradesh: ఎన్నికల్లో ఓడిపోతానన్న భయంతోనే చంద్రబాబు పవన్ కల్యాణ్ కు పాలిష్ వేస్తున్నారు!: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు

  • బీజేపీపై ఆయన బురద చల్లుతూనే ఉన్నారు
  • మేం చౌకబారు రాజకీయాలు చేయబోం
  • అసెంబ్లీ ఎన్నికల్లో ఆశ్చర్యపోయే ఫలితాలు వస్తాయ్

రాజకీయ గిమ్మిక్కులు చేయడంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని మించినవారు ఎవరూ లేరనీ ఏపీ బీజేపీ శానససభ పక్షనేత విష్ణుకుమార్ రాజు విమర్శించారు. తనకు ఉన్న 40 ఏళ్ల అనుభవాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా వాడాలో ఆయనకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. అవసరమైనప్పుడల్లా టీడీపీ అధినేత తమపై బురద చల్లుతూనే ఉన్నారని పేర్కొన్నారు. బీజేపీ జాతీయ పార్టీ అనీ, ఎంతమంది ఎన్ని పొత్తులతో కలిసి వచ్చినా తమకు ఏమీ కాదని ధీమా వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఈ రోజు ఆయన ఓ మీడియా ఛానల్ తో మాట్లాడారు.

బీజేపీ, జనసేనతో చేతులు కలపడం వల్లే ఈరోజు టీడీపీ ఏపీలో అధికారంలో ఉందని విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. జనసేనలో ఈరోజు చేరబోతున్న ఆకుల సత్యనారాయణకు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ చౌకబారు రాజకీయాలు చేయబోదని స్పష్టం చేశారు. కానీ టీడీపీ మాత్రం ఓట్ల కోసం, స్వార్థంతో రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఏపీలో 20 లక్షల మందితో కాకుంటే కోటి మందితో టీడీపీ సభ పెట్టుకోవచ్చని స్పష్టం చేశారు.

గతంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా 'బీజేపీ అనే పదంలో బీ అంటే బీజేపీ, జే అంటే జగన్, పీ అంటే పవన్ కల్యాణ్' అంటూ టీడీపీ విమర్శించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే రాబోయే ఎన్నికల్లో పవన్ సాయం లేకుంటే గెలవడం కష్టమని గుర్తించిన చంద్రబాబు.. ఇప్పుడు జనసేనానికి పాలిష్ వేస్తున్నారని ఎద్దేవా చేశారు. అందుకే పవన్ ను విమర్శించడం మానేసి ఆ స్థానంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ను తీసుకొచ్చారని అభిప్రాయపడ్డారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశ్చర్యపోయే ప్రజా తీర్పు రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News