nithin gadkari: ఏపీకి మోదీ అందించినంత సాయం ఏ ప్రధాని అందించలేదు : కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరి

  • విజయవాడలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం
  • సమావేశంలో టీడీపీకి సవాల్‌ విసిరిన మంత్రి
  • దేశంలో సుపరిపాలన ప్రధాని లక్ష్యమని వ్యాఖ్య

దేశ ప్రధానులుగా ఇప్పటి వరకు పనిచేసిన ఎవరి హయాంలోనూ అందనంత సాయం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం అందించిందని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరి అన్నారు. విజయవాడలో నేడు జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయంలో ఏమైనా అనుమానాలుంటే లెక్కలతో సహా చెప్పగలనని టీడీపీ నాయకులకు సవాల్‌ విసిరారు. కేవలం రోడ్లు, పోర్టుల నిర్మాణానికి తన శాఖ నుంచే ఏపీకి 25 వేల కోట్ల రూపాయలు ఇచ్చినట్లు తెలిపారు. కేంద్రం ఆర్థిక పరంగా రాష్ట్రానికి చేయాల్సినంత సాయం చేస్తోందని, ఎంతచేస్తున్నా రాజకీయ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏమీ చేయడం లేదంటూ విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

పోలవరం ప్రాజెక్టు వంద శాతం ఖర్చు కేంద్రమే భరిస్తోందని, ఇప్పటి వరకు 62 శాతం పనులకు నిధులు మంజూరు చేశామని చెప్పారు. ప్రాజెక్టును బీజేపీ ప్రభుత్వం పూర్తిచేసి తీరుతుందని చెప్పారు. అనంతపురం-అమరావతి హైవే నిర్మాణాన్ని 20 వేల కోట్ల రూపాయలతో పూర్తిచేయనున్నట్లు తెలిపారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక క్యారిడార్‌ను కూడా పూర్తి చేస్తామని తెలిపారు. కాకినాడలో పెట్రోకెమికల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

దేశవ్యాప్తంగా సుపరిపాలన అందించాలన్నది మోదీ లక్ష్యమని చెప్పారు. బీజేపీ కుటుంబ పార్టీ కాదని, కార్యకర్తల పార్టీ అని అన్నారు. యాభై ఏళ్లలో జరగని అభివృద్ధి మోదీ ఐదేళ్లలో చేసి చూపించారని తెలిపారు. గతంలో పనిచేసిన బీజేపీయేతర ప్రభుత్వాల హయాంలో దేశంలో టెర్రరిజం పెరిగిపోయిందని,  మోదీ వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా అదుపులోకి తెచ్చారన్నారు. కాగా, ఈబీసీ రిజర్వేషన్‌ కల్పించినందుకు గడ్కరిని రాష్ట్ర నాయకులు సన్మానించారు.

More Telugu News