dmk: తమిళనాడు సీఎం కుర్చీ కోసం పన్నీర్ సెల్వం రహస్య పూజలు.. డీఎంకే అధినేత స్టాలిన్ ఆరోపణలు!

  • సీఎం పళనిస్వామి జైలుకు వెళ్లాలని పూజలు
  • ఉదయం 3.30 గంటలకు జరిగిందన్న డీఎంకే చీఫ్
  • స్టాలిన్ విమర్శలను ఖండించిన మంత్రి జయకుమార్

తమిళనాడు విపక్ష నేత, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సంచలన ఆరోపణలు చేశారు. తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం నిన్న తెల్లవారుజామున 3.30 గంటలకు సచివాలయంలో రహస్య పూజలు చేయించారని ఆరోపించారు. ఉదయం 5.30 గంటలకు ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి కావాలన్న ఆశతోనే పన్నీర్ సెల్వం ఈ పూజలు చేయించారని దుయ్యబట్టారు. సీఎం పళనిస్వామి జల్లికట్టు పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లిన తరుణంలో ఈ పూజలు జరిగాయన్నారు.

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత తరహాలో కొడనాడు ఎస్టేట్ కేసులో పళనిస్వామి జైలు పాలవ్వాలని ఈ పూజలు జరిగాయని స్టాలిన్ తెలిపారు. పళనిస్వామి జైలుకు వెళ్లగానే తాను సీఎం కావాలని పన్నీర్ సెల్వం కలలు కంటున్నారని విమర్శించారు. అన్ని మతాలకు సమానమైన సచివాలయంలో పూజలు నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు.

ఈ ఆరోపణలు చేసినందుకు తనపై కేసు పెట్టే అవకాశముందనీ, దమ్ముంటే ఆ పని చేయాలని సవాల్ విసిరారు. మరోవైపు స్టాలిన్ విమర్శలను మంత్రి జయకుమార్ ఖండించారు. అన్నాడీఎంకేలో చీలికలు తీసుకొచ్చేందుకు దినకరణ్, స్టాలిన్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

More Telugu News