OXFAM: సగం మంది భారతీయుల ఆస్తితో సమానమైన టాప్-9 బిలియనీర్ల ఆస్తులు!

  • దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు
  • భారత సంపదపై అధ్యయనాన్ని విడుదల చేసిన ఆక్స్ ఫామ్
  • 2018లో రోజుకు రూ. 2,200 కోట్లు చొప్పున పెరిగిన బిలియనీర్ల సంపద

ఇండియాలో అత్యంత అట్టడుగు నుంచి సగం మంది ప్రజల ఆస్తితో టాప్-9 బిలియనీర్ల ఆస్తి సమానమైంది. ఆక్స్ ఫామ్ సంస్థ ఓ అధ్యయనం నిర్వహించి, భారత బిలియనీర్లపై ఆసక్తికర అంశాలను విడుదల చేసింది. గత సంవత్సరం భారత బిలియనీర్ల సంపద రోజుకు రూ. 2,200 కోట్ల చొప్పున పెరిగిందని, దేశంలోని 1 శాతం ధనవంతుల సంపద సరాసరిన 39 శాతం పెరిగిందని తెలిపింది. ఇదే సమయంలో కింద ఉన్న సగం మంది భారతీయుల సంపద సరాసరిన 3 శాతం పెరిగిందని వెల్లడించింది. ఇండియాలో అత్యంత దారిద్ర్యంలో మగ్గుతున్న 13.6 కోట్ల మంది ప్రజల్లో ఎటువంటి మార్పూ కనిపించలేదని పేర్కొంది.

ఇక ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే, బిలియనీర్ల ఆస్తి 12 శాతం పెరిగిందని, సగం మంది పేదల సంపద 11 శాతం మేరకు హరించుకుపోయిందని ఆక్స్ ఫామ్ వెల్లడించింది. దావోస్ లో జరుగుతున్న ఐదు రోజుల వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాల సందర్భంగా ఆక్స్ ఫామ్ తన అధ్యయనం రిపోర్టును విడుదల చేసింది. పేద, ధనికల మధ్య అంతరం గణనీయంగా పెరిగిపోతుండటం కొత్త సమస్యలను సృష్టించనున్నదని, దావోస్ కు వచ్చే ప్రజా ప్రతినిధులు, వ్యాపార దిగ్గజాలు, ఆర్థికవేత్తలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని ఆక్స్ ఫామ్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైరెక్టర్ వైనీ బైఎనిమా వెల్లడించారు. ఇండియాలో ధనవంతులు తమ సంపదను పెంచుకుంటూ సాగుతుంటే, పేదలు, తమ తదుపరి భోజనానికి, పిల్లల వైద్య ఖర్చులకు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొందని ఆమె అన్నారు.

గత సంవత్సరంలో ప్రపంచంలోని 44 మంది బిలియనీర్ల ఆస్తి విలువ 380 మంది కోట్లకు సమానంకాగా, ఈ సంవత్సరం 26 మంది ఆస్తి విలువ అంత మొత్తానికి పెరిగిందని గుర్తు చేసిన ఆమె, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ తన సంపదను 112 బిలియన్ డాలర్లు పెంచుకున్నారని, ఆయన ఆస్తిలో ఒక శాతం విలువ 11.5 కోట్ల మంది ప్రజలున్న ఇథియోపియా హెల్త్ బడ్జెట్ తో సమానమని అన్నారు.

ఇండియాలోని జనాభాలో 10 శాతం ప్రజల వద్ద 77.4 శాతం జాతి సంపద ఉందని, టాప్ లో 1 శాతం ధనవంతుల వద్ద 51.53 శాతం సంపద ఉందని తమ అధ్యయనంలో వెల్లడైనక్టు ఆక్స్ ఫామ్ వెల్లడించింది. 2018 నుంచి ఇండియాలో రోజుకు 70 మంది మిలియనీర్లు పుట్టుకొస్తున్నారని, ఈ పరిస్థితి 2022 వరకూ ఉంటుందని భావిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఇండియాలోని బిలియనీర్ల సంఖ్య 119కి పెరిగిందని, వారి వద్ద ఉన్న సంపద విలువ రూ. 28 లక్షల కోట్లని వెల్లడించారు. వీరంతా తాము చెల్లిస్తున్న పన్నులను అర శాతం మేరకు పెంచినా, ఆ వచ్చే డబ్బుతో భారత హెల్త్ బడ్జెట్ ను 50 శాతం మేరకు పెంచవచ్చని అంచనా వేసింది.

More Telugu News