vaishnav tej: మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో .. ఫస్టు పోస్టర్ రిలీజ్

  • హీరోగా వైష్ణవ్ తేజ్ ఎంట్రీ 
  • దర్శకుడిగా బుచ్చిబాబు పరిచయం
  • ఈ రోజునే షూటింగ్ మొదలు

మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలామంది హీరోలు వచ్చేశారు. ఎవరి ప్రత్యేకతను చాటుకుంటూ వాళ్లు దూసుకెళుతున్నారు. ఈ నేపథ్యంలో సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు ..  వైష్ణవ్ తేజ్ హీరోగా ఒక సినిమాను రూపొందిస్తున్నాడు.

ఈ రోజున ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమవుతోంది. సుకుమార్ .. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టు పోస్టర్ ను వదిలారు. జాలరి వేషధారణలో వైష్ణవ్ తేజ్ కనిపిస్తున్నాడు. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ .. "2009 లో హీరోగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నా ప్రయాణం మొదలైంది. అప్పటి నుంచి కూడా నేను నటన పరంగా చాలా విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాను. ఈ ఏడాది మా లిటిల్ బ్రదర్ వైష్ణవ్ తేజ్ తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయమవుతున్నాడు. నన్ను ఆదరించినట్టే నా సోదరుడిని ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అని అన్నాడు.

More Telugu News