congress: బెంగళూరు రిసార్టులో ఘర్షణ.. ఎమ్యెల్యే తలపై బాటిల్ తో కొట్టిన మరో ఎమ్మెల్యే

  • కర్ణాటకలో ఆపరేషన్ లోటస్
  • ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించిన కాంగ్రెస్
  • ఆనంద్ సింగ్ తలపై బాటిల్ తో కొట్టిన జేఎన్ గణేష్

కర్ణాటకలో మళ్లీ రిసార్టు రాజకీయాలు మొదలయ్యాయి. తమ ఎమ్మెల్యేలను లాక్కుని, సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ యత్నిస్తుండటంతో... బెంగళూరులోని ఈగిల్టన్ రిసార్టుకు తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ తరలించింది. ఈ నేపథ్యంలో, రిసార్టులో కొందరు ఎమ్మెల్యేల మధ్య నిన్న ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ తలపై మరో ఎమ్మెల్యే జేఎన్ గణేష్ ఓ బాటిల్ తో కొట్టారు. గాయపడ్డ ఆనంద్ సింగ్ ను ఆసుపత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రికి ఈ ఉదయం కాంగ్రెస్ నేతలు క్యూ కట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రఘునాథ్ మీడియాతో మాట్లాడుతూ, తాము లోపలకు వెళ్లేందుకు అనుమతించడం లేదని చెప్పారు.

మరోవైపు, ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగిందనే వార్తల్లో నిజం లేదని మంత్రి డీకే శివకుమార్ తెలిపారు. ఇంకోవైపు కాంగ్రెస్ తీరుపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత పరిస్థితులు ఎంతగా దిగజారిపోయాయో ఇంతకన్నా రుజువు మరేం కావాలని వారు ప్రశ్నించారు. ఈగిల్టన్ ఘర్షణలో ఒక ఎమ్మెల్యే ఆసుపత్రిపాలయ్యారని... అంతర్గత విభేదాలను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీపై కాంగ్రెస్ ఎంత కాలం ఆరోపణలు చేస్తుందని అన్నారు. దీనిపై డీకే శివకుమార్ స్పందిస్తూ, అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ ఎమ్మెల్యేలంతా ఐకమత్యంగా, కలసిమెలసి ఉన్నారని చెప్పారు. ఈగిల్టన్ రిసార్టుకు 76 మంది ఎమ్మెల్యేలను శుక్రవారంనాడు కాంగ్రెస్ పార్టీ తరలించింది. 

More Telugu News