Hyderabad: భాగ్యనగరికి నీటి కష్టాలు... జనవరి 31 నాటికి లక్ష కనెక్షన్లకు సరఫరా బంద్!

  • అడుగంటిన మంజీరా జలాశయం
  • కూకట్ పల్లి, పటాన్ చెరువు, శేరిలింగంపల్లిపై ప్రభావం
  • గోదావరి, కృష్ణా జలాలను తరలిస్తామంటున్న అధికారులు

హైదరాబాద్ వాసులను నీటి కష్టాలు వెంటాడనున్నాయి. ఈ నెలాఖరు నాటికి దాదాపు లక్ష నల్లాలకు నీటి సరఫరా నిలిచిపోనుంది. నగరానికి మంజీరా నీటి సరఫరాను నిలిపివేయాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డ్ నిర్ణయం తీసుకోవడంతో కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు, శేరిలింగంపల్లి, పటాన్ చెరు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలుగనున్నాయి.

మంజీరా రిజర్వాయర్ లో నీటి నిల్వ అడుగంటిపోవడంతో జీహెచ్ఎంసీ పరిధిలో నీటి సరఫరాను నిలపాలని అధికారులు నిర్ణయించారు. గత సంవత్సరం ఇదే సమయానికి మంజీరా జలాశయంలో 1,645.6 అడుగుల మేరకు నీటి నిల్వ ఉండగా, ఈ సంవత్సరం అది 1,641.8 అడుగులకు తగ్గింది. కర్ణాటకలో తగినన్ని వర్షాలు లేకపోవడంతో గత రెండు నెలల నుంచి మంజీరా, సింగూరు రిజర్వాయర్లలోకి నీటి ప్రవాహం లేదు. అయినప్పటికీ రోజుకు 1.3 కోట్ల గ్యాలన్ల నీటిని అధికారులు సరఫరా చేస్తూ వచ్చారు.

నీరు మరింతగా అడుగంటడంతోనే నీటి సరఫరా ఆపివేయాలని నిర్ణయించినట్టు హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ చీఫ్ జనరల్ మేనేజర్ డీ సుదర్శన్ తెలిపారు. నీటి సరఫరా నిలిచే ప్రాంతాలకు గోదావరి, కృష్ణా జలాలను పంపే ప్రయత్నాలు ప్రారంభించామని అన్నారు.

More Telugu News