Vijay Malya: ఎల్లకాలం అక్కడే ఉండలేవు: విజయ్ మాల్యాపై న్యాయమూర్తి

  • రాజకీయ కక్ష సాధింపు చర్యలుంటాయంటున్న మాల్యా
  • ఇంకెంతో కాలం బ్రిటన్ లో ఉండలేరు
  • ఆర్థిక నేరగాడేనన్న ముంబై ప్రత్యేక కోర్టు

తాను ఇండియాకు వెళితే, రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఉంటాయని చెబుతూ, ఎల్లకాలమూ బ్రిటన్ లోనే ఉండాలంటే కుదరదని, మాల్యా ఇంకెంతో కాలం అక్కడ ఉండలేరని ముంబై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంఎస్ అజ్మి వ్యాఖ్యానించారు. మాల్యాను ఆర్థిక నేరగాడిగా ప్రకటించే ఆర్డర్ ను చదివిన ఆయన, తానేదో చట్టానికి కట్టుబడిన వాడినన్నట్టు మాల్యా ప్రవర్తిస్తున్నారని అన్నారు.

రాజకీయ నేతలు తనను జైల్లో పెట్టి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నారని, ఇండియాలో తనకు న్యాయం జరగదని, అందుకే తాను స్వదేశానికి వెళ్లేందుకు నిరాకరిస్తున్నానని మాల్యా చెబుతున్న సంగతి తెలిసిందే. కొత్తగా మారిన చట్టం ప్రకారం, మాల్యాను ఆర్థిక నేరగాడిగా ప్రకటించాలని కోరుతూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పిటిషన్ దాఖలు చేయగా, విచారించిన కోర్టు ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

అంతకుముందు మాల్యా తరఫున వాదనలు వినిపిస్తూ, మార్చి 2016లో తన క్లయింట్ ఓ సమావేశం నిమిత్తం విదేశాలకు వెళ్లారేతప్ప, రహస్యంగా, చట్ట విరుద్ధంగా వెళ్లలేదని, అప్పటికి ఆయనపై అరెస్ట్ వారెంట్ ఏమీ లేదని గుర్తు చేశారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి, చట్టాన్ని గౌరవించే వ్యక్తే అయితే, ఇంతకాలం ఎందుకు రాలేదని ప్రశ్నించారు.

More Telugu News