Tirumala: తాళాలు పగులగొట్టి మహాద్వారం గుండా తిరుమల ఆలయంలోకి చొరబడిన భక్తులు!

  • పుణె నుంచి వచ్చిన 15 మంది భక్తులు
  • అడ్డదారిలో ఆలయంలోకి ప్రవేశించిన ముగ్గురు
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు

అనుక్షణం అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే తిరుమలలో నిఘా నేత్రాల కళ్లుగప్పిన కొందరు భక్తులు తాళాలు పగులగొట్టి, మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించడం కలకలం రేపింది. భద్రతా వైఫల్యాన్ని చెప్పకనే చెబుతున్న ఈ ఘటన స్వామివారికి సుప్రభాత సేవ జరిపే వేళ జరిగింది.

 స్వామి దర్శనార్థం మహారాష్ట్రలోని పుణెకు చెందిన 15 మంది భక్తులు రాగా, వారిలో ముగ్గురు ఈ పని చేశారు. రద్దీ ఎక్కువగా ఉన్న దృష్ట్యా, కంపార్టుమెంట్లు, క్యూలైన్లన్నీ నిండిపోవడంతో ఎంతోసేపు వేచిచూసిన వీరిలో ముగ్గురు బయటకు వచ్చారు. అడ్డదారిలో ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఎలిఫెంట్ గేట్ వద్ద ఉన్న తాళాన్ని పగులగొట్టారు. ఆలయంలోకి ప్రవేశించారు.

 ఆ సమయంలో సుప్రభాత సేవ జరుగుతూ ఉండటం, మిగతా భక్తులంతా సంప్రదాయ వస్త్రధారణలోను, వీరు మాత్రం మామూలుగాను ఉండటంతో ఆలయంలో విధుల్లో వున్న టీటీడీ సిబ్బంది అడ్డుకున్నారు. ఆపై భద్రతా సిబ్బందికి అప్పగించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు, విచారిస్తున్నట్టు తెలిపారు.

More Telugu News