Ocean: రాజమహేంద్రవరం ఓఎన్జీసీ నుంచి అత్యంత ప్రమాదకర రేడియో ధార్మిక పదార్థం మాయం... రంగంలోకి దిగిన డిజాస్టర్ టీమ్!

  • సముద్రాల్లో ముడిచమురు అన్వేషణలో వాడే సీఎస్-137
  • గాల్లో కలిస్తే మానవాళికి ముప్పే
  • కృష్ణా జిల్లాకు తీసుకెళ్లి, తిరిగి తెస్తుండగా మాయం

సముద్ర అంతర్భాగాల్లో ముడిచమురు అన్వేషణకు వినియోగించే 'సీఎస్-137 ఐసోటోప్' రేడియో ధార్మిక పదార్థం మాయమైనట్టు తెలుస్తోంది. రాజమహేంద్రవరంలోని ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ లో ఈ ఘటన జరగడం, ప్రత్యేక పరికరాలతో వెతికినా దాని జాడ దొరకకపోవడం, అది అత్యంత ప్రమాదకారి కావడంతో డిజాస్టర్ మేనేజ్ మెంట్ టీమ్ రంగంలోకి దిగింది.

కాగా, సీఎస్-137 సులువుగా లభించదు. యురేనియంను విచ్ఛితి చేసి తయారు చేస్తారు. ఇది ఓ క్షారలోహం. ఘన రూపంలో చిన్న బిస్కెట్ ముక్క మాదిరిగా ఉంటుంది. దీని విలువ రూ. 35 లక్షల వరకూ ఉంటుందని తెలుస్తోంది. వాస్తవానికి దీని నిల్వ, భద్రత, రవాణా తదితర వ్యవహారాల్లో అత్యంత జాగ్రత్తలు పాటిస్తుంటారు అధికారులు.

లీథియం, సోడియం, రుబీడియం కేటగిరీలో చివరిలో ఉండే సీజీఎం నుంచి ఆల్ఫా, బీటా, గామా కిరణాలు మానవాళిని నాశనం చేసే స్థాయిలో వెలువడుతుంటాయి. వీటిని శునకంపై ప్రయోగిస్తే, అది 33 రోజుల్లో మరణిస్తుంది. గాల్లో కలిస్తే, మనుషుల ప్రాణాలకు అపాయం. దీన్ని ఈ నెల 12న కృష్ణా జిల్లా మల్లేశ్వరంలోని ఓఎన్జీసీ డ్రిల్లింగ్ సైట్ కు తీసుకెళ్లి, తిరిగి 14న బేస్ క్యాంపుకు తీసుకు వచ్చారు. ఆపై అది కనిపించడం లేదు.

దాదాపు 30 కిలోల బరువుండే కంటెయినర్ లో దీన్ని ఉంచామని, ఇప్పుడది ఎక్కడుందో తెలియడం లేదని బొమ్మూరు పోలీసులకు ఓఎన్జీసీ ఫిర్యాదు చేసింది. దీని తీవ్రతపై మరింత సమాచారం కోసం అటామిక్ రీసెర్చ్ సెంటర్, న్యూక్లియర్ ఎనర్జీ కమిషన్ లకు లేఖలు రాశామని, కేంద్ర మంత్రిత్వ శాఖలను సంప్రదిస్తున్నామని అధికారులు తెలిపారు.

More Telugu News