IRCTC: ఐఆర్సీటీసీ హోటళ్ల కేసులో లాలూకు బెయిల్ మంజూరు

  • 2006లో లాలూపై కేసు నమోదు
  • రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన పటియాలా కోర్టు
  • లాలూ కుటుంబీకులకు మధ్యంతర బెయిల్ పొడిగింపు

రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి లాలూకు బెయిల్ మంజూరైంది. ఢిల్లీలోని పటియాలా న్యాయస్థానం లాలూకు బెయిల్ మంజూరు చేసింది. తొలుత ఈ కేసుకు సంబంధించి లాలూకు గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిల్ ని ఈ నెల 28 వరకు పొడిగించింది. లాలూతో పాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వి యాదవ్ కు కూడా మధ్యంతర బెయిల్ ని ఈ నెల 28 వరకు పొడిగించారు.

అయితే, లాలూకు రెగ్యులర్ బెయిల్ మంజూరు విషయమై ఈ నెల 28న తీర్పును ప్రకటిస్తామని న్యాయస్థానం పేర్కొంది. కానీ, ఈరోజు మధ్యాహ్నం మరోసారి విచారించిన కోర్టు, ఆయనకు రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించింది. లక్ష రూపాయల బెయిల్ బాండ్, ఒకరి పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. కాగా, 2006లో ఐఆర్సీటీసీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై లాలూ, ఆయన కుటుంబంపై సీబీఐ కేసు నమోదు చేసింది.

More Telugu News