kolkata: కోల్ కతా సభ.. సోనియాగాంధీ సందేశాన్ని చదివి వినిపించిన మల్లికార్జున ఖర్గే

  • దేశ వ్యవసాయ రంగంలో సంక్షోభం పెరుగుతోంది
  • యువత, నిరుద్యోగుల్లో తీవ్ర నిస్పృహ నెలకొంది
  • ఆర్థికంగా దేశప్రజలు చితికిపోయారు

కోల్ కతాలో బీజేపీ యేతర పక్షాల ర్యాలీ అనంతరం నిర్వహించిన సభలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ సందేశాన్ని ఆయన చదివి వినిపించారు. దేశ వ్యవసాయ రంగంలో సంక్షోభం పెరుగుతోందని, యువత, నిరుద్యోగుల్లో తీవ్ర నిస్పృహ నెలకొందని, ఆర్థికంగా దేశప్రజలు చితికిపోయారని ఆ సందేశంలో సోనియా పేర్కొన్నారు.

సమాజంలో విద్వేషపూరిత భయానక వాతావరణం పెరుగుతోందని, లౌకిక స్ఫూర్తిని కాపాడుకుంటూ మతతత్వ శక్తులను తరిమికొట్టాల్సిన సమయమిదని, కాంగ్రెస్ తరపున దేశ ప్రజలందరికీ ఇదే సందేశమని సోనియగాంధీ చెప్పారని అన్నారు. మనం ఏకం కానంత వరకూ మోదీ, అమిత్ షా ఇదే నిరంకుశ ధోరణితో కొనసాగుతారని, దేశంలో వర్గాల వారీగా వైషమ్యాలను పెంచుతున్నారని, కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని, ఒక్క రాఫెల్ కుంభకోణంలోనే అనిల్ అంబానీకి రూ.30 వేల కోట్లు దోచిపెట్టారని ఆరోపించారు.

 రైతులు, ఎస్సీ, ఎస్టీలు ప్రాణాలు కోల్పోతున్నారని, ఎన్నికల హామీలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని మోదీ చెప్పారని, ఆ ఉద్యోగాలు ఎక్కడ? అని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ప్రజల జీవితాలు అస్తవ్యస్తంగా మారాయని, అవేవీ పట్టని మోదీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలని ఎలా ఆలోచిస్తోందని సోనియా ప్రశ్నించారు. రాఫెల్ కుంభకోణం విషయంలో సుప్రీంకోర్టుకు తప్పుడు అఫిడవిట్ సమర్పించారని, లౌకిక స్ఫూర్తి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు విపక్షాలన్నీ కలిసి పోరాడాల్సి ఉందని, లక్ష్యం చాలా కఠినమైనదే కావచ్చు కానీ, చేయి చేయి కలిపి సాగుదామంటూ పిలుపు నిచ్చిన సోనియాగాంధీ సందేశాన్ని ఖర్గే చదివి వినిపించారు. 

More Telugu News