mexico: మెక్సికోలో ఆయిల్‌ పైప్‌లైన్‌ వద్ద భారీ పేలుడు... 20 మంది దుర్మరణం

  • మరో 54 మందికి తీవ్రగాయాలు
  • లీకైన ఆయిల్‌ పట్టుకునేందుకు వెళ్లగా ఘటన
  • సహాయక చర్యలు చేపట్టిన ప్రభుత్వం

మెక్సికోలోని ప్రభుత్వ రంగ  పెమెక్స్‌ చమురు సంస్థకు చెందిన ఆయిల్‌ పైప్‌లైన్‌ వద్ద భారీ పేలుడు సంభవించి 20 మంది దుర్మరణం చెందగా, మరో 54 మంది తీవ్రంగా గాయపడ్డారు. మెక్సికో సిటీలోని త్లాహులిల్‌పాన్‌ ప్రాంతంలో  ఈ ఘటన చోటుచేసుకుంది.

సంస్థకు చెందిన పైపులైన్‌కు తాహ్లులిల్ పాన్ ప్రానతంలో చమురు దొంగలు కన్నం పెట్టారు. ఆ లీకేజీ నుంచి వెలువడుతున్న ఆయిల్‌ను పట్టుకునేందుకు భారీ స్థాయిలో జనం అక్కడ గుమిగూడారు. ఆ సమయంలో పైపు నుంచి ఆయిల్‌తోపాటు గ్యాస్‌ కూడా లీకవ్వడంతో హఠాత్తుగా పేలుడు సంభవించింది. దీంతో అప్పటికే పైపులైన్‌ వద్ద ఆయిల్‌ కోసం గుమిగూడిన వారిలో చాలామంది మృత్యువాత పడగా మిగిలిన వారు గాయపడ్డారు.

‘పదుల సంఖ్యలో స్థానికులు బకెట్లు, క్యాన్లు పట్టుకుని లీక్‌ అవుతున్న చమురు పట్టుకునేందుకు పైపులైన్‌ వద్ద గుమిగూడారు. ఆ సమయంలో బ్లాస్ట్‌ జరగడంతో భారీగా ప్రాణనష్టం జరిగింది’ అని హిడాగో రాష్ట్ర గవర్నర్‌ ఒమర్‌ ఫయ్యద్‌ స్థానిక టెలివిజన్‌కు తెలిపారు. మెక్సికోలో ఆయిల్‌ కంపెనీ పైపులైన్లకు రంధ్రాలు చేసి లీకైన చమురును పట్టుకుని బ్లాక్‌ మార్కెట్‌కు తరలించే వ్యాపారం బారీ స్థాయిలో జరుగుతుంది. ఈ కారణంగా ఏటా మూడు వందల కోట్ల డాలర్ల మేర మెక్సికో ఆయిల్‌ జెయింట్‌ పెమక్స్‌ నష్టపోతోంది.

More Telugu News