sensex: సన్ ఫార్మా ఎఫెక్ట్.. ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు

  • ఆరోపణల నేపథ్యంలో పతనమైన సన్ ఫార్మా షేర్లు
  • రిలయన్స్ అండతో పుంజుకున్న మార్కెట్లు
  • 13 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

దేశీయ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. ఈ ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత చివర్లో కాస్త కోలుకున్నాయి. సన్ ఫార్మా షేర్ల ప్రభావం ఈరోజు మార్కెట్లపై పడింది. ఆ కంపెనీపై కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, కంపెనీ షేర్లు ఏకంగా 8 శాతంపైగా నష్టపోయాయి.

మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ అండతో మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో రూ. 1000 కోట్లకు పైగా లాభాలు వచ్చాయన్న రిలయన్స్ ప్రకటనతో ఆ కంపెనీ షేర్లు 4 శాతం పైగా లాభపడ్డాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 13 పాయింట్ల లాభంతో 36,387కి పెరిగింది. నిఫ్టీ 2 పాయింట్లు లాభపడి 10,907 వద్ద స్థిరపడింది.

ఈనాటి ట్రేడింగ్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్, కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఏసియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ తదితర కంపెనీలు లాభాలను మూటగట్టుకున్నాయి. సన్ ఫార్మా, భారతీ ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, ఎన్టీపీసీ తదితర కంపెనీలు నష్టపోయాయి.

More Telugu News